ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర మానసిక క్షోభ, అసంతృప్తిని రగిలిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం విడుదల చేసిన 7,437పోలీస్ పోస్టుల నోటిఫికేషన్లో ఎన్నో నిబంధనల చిక్కులు ఎదురవుతున్నాయి. వయోపరిమితి సడలింపు, లాంగ్ జంప్ పెంచడం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేయడంతోపాటు గ్రేటర్ పరిధిలోని ఉద్యోగాలను మినహాయించడం వంటి అంశాలు అభ్యర్థులను తీవ్రఆందోళనకు గురి చేస్తున్నాయి. రిక్రూట్మెంట్ బోర్డు విధించిన కఠిన నిబంధనలు నిరుద్యోగులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 13 వేల ఉద్యోగాలను మాత్రమే నింపింది. పైగా తాము ఇవ్వని 67, 673 ఉద్యోగాలను ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నది. వారం రోజుల క్రితం 7,437 పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. కాని ఏజ్ మాత్రం పెంచకపోగా, తగ్గించింది. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కారణంగా జీవో నంబర్ 48 జారీ చేసి, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు వయోపరిమితిని 3 ఏండ్లు సడలించింది. నోటిఫికేషన్ సమయంలో విద్యార్థుల డిమాండ్ మేరకు జీవో నంబర్ 60 జారీ చేసి, మరో రెండేండ్ల సడలింపు ఇచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏండ్లు, ఎస్ఐ పోస్టులకు 37 ఏండ్ల వయోపరిమితి పెంచుతూ 2024 ఫిబ్రవరి 8న జీవో నంబర్ 31 జారీ చేసింది. కానీ జీవో నంబర్ 31 అమల్లో ఉన్న రెండేండ్లలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషనే రాలేదు.
జీవో కాలపరిమితి ముగియడంతో 2026 మే 5న జీవో నంబర్ 87 జారీ చేసింది. ఈ జీవో ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు 34 ఏండ్లు, ఎస్ఐ ఉద్యోగాలకు 37 ఏండ్ల వయోపరిమితి కల్పించకపోగా 2 ఏండ్లు తగ్గించి 32, 35కు పరిమితం చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు 36, ఎస్ఐ జాబులకు 38 ఏండ్ల వయోపరిమితి కల్పించాలని నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి 35 ఏండ్లు, ఎస్ఐ ఉద్యోగానికి 38 ఏండ్లుగా ఉన్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం లాంగ్ జంప్‌ను 4 మీటర్లకు పెంచి నిరుద్యోగ అభ్యర్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నది. ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్‌లో 3.8 మీటర్లు, కేరళలో 3.5 మీటర్లు, కర్ణాటకలో 3.8 మీటర్లు, తమిళనాడులో 3.8 మీటర్లుగా అమల్లో ఉన్నది. దేశ సరిహద్దులను కాపాడే సైనికులకు కూడా 3.6 మీటర్ల నిబంధననే అమలు చేస్తున్నారు. ఫైర్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఫోర్‌వీలర్ లైసెన్స్ ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. గ్రామీణ ప్రాంత మహిళా అభ్యర్థులు ఎంత మేరకు లైసెన్స్‌లు కలిగి ఉంటారో రిక్రూట్మెంట్ బోర్డుకే తెలియాలి.
జూలై 29న జారీ చేసిన పోలీస్ నోటిషికేషన్లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి ఉద్యోగాలను చేర్చలేదు. గతంలో గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఉండగా కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త కమిషనరేట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి జీవో నంబర్ 81 జారీ చేసింది. ఇప్పుడు ఆ జీవో నంబర్ 81 రాష్ట్రపతి ఉత్తర్వులో చేర్చిన తర్వాతనే గ్రేటర్ పరిధిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పాత మూడు కమిషనరేట్ల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త కమిషనరేట్లను వచ్చే నోటిఫికేషన్లో అమలు చేయవచ్చని విద్యార్థులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లోనే గ్రేటర్ పరిధిలోని ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తుకు రూ.1200 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600), ఎస్ఐ ఉద్యోగ దరఖాస్తుకు రూ.1500 (ఎస్స్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750) ఫీజును నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉద్యోగ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది.
కానీ ఇప్పుడు భారీగా ఫీజులు పెంచడమేందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకొనే నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తున్నదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 19 వేల పోలీసు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తుంటే ప్రభుత్వం కేవలం 7,437 ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు నింపకుండా, వయోపరిమితి సడలింపు ఇవ్వకుండా, లాంగ్ జంప్ నిబంధనలు కఠినతరం చేస్తూ, లైసెన్సింగ్ విధానాన్ని తీసుకువచ్చి, గ్రేటర్ ఉద్యోగాలను చేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మానసిక సంఘర్షణకు గురిచేస్తున్నది. తక్షణమే నిరుద్యోగుల డిమాండ్లను అంగీకరించి, వారి సూచనలు పాటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు)
-పాలకూరి అశోక్‌గౌడ్ ,9491873831