– కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్
కట్టంగూర్, జనవరి 07 : రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నల్లగొండ జిల్లా ఎస్సీ శరత్ చంద్ర పవార్ నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్- నో పెట్రోల్ కార్యక్రమం నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని బంక్ సిబ్బందికి సూచించారు.
పెట్రోల్ కోసం సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే వాహనదారులపైనే కాకుండా హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోసిన సిబ్బందిపై కూడా సీసీ కెమెరాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని వాటిని అరికట్టేందుకే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తునట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది బండారు సతీష్, గంట శ్రీను, మధుసూదన్ రెడ్డి, విజయ్, కోటి, బంక్ సిబ్బంది పాల్గొన్నారు.