యాదగిరిగుట్ట, డిసెంబర్ 20 : వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి నూతన జంట మృతి చెందిన ఘటనపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావించినా ఘటనకు కొద్ది నిమిషాలకు ముందు రైలులో ఆ జంట తీవ్రస్థాయిలో గొడవ పడిన వీడియో ఒకటి బయటపడటంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు కాలిజారి మృతి చెందారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. భువనగిరి రైల్వే బీఆర్పీ ఇంచార్జి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలానికి (25) అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)తో రెండు నెలల కిత్రం వివాహమైంది.
సింహాచలం హైదరాబాద్‌లోని ఓ కెమికల్ కంపెనీలోని పనిచేస్తూ భార్య భవానితో కలిసి జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు వంగపల్లి స్టేషన్ దాటి వేగంగా వెళ్తుండగా ద్వారం వద్ద నిలబడి ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ రైలు నుంచి కిందపడ్డారు. దీంతో తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ గమనించి రైల్వే పోలీసులు సమాచారం మిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్లో మచిలీపట్నం రైలు ఎక్కిన సింహాచలం, భవాని గొడవ పడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన భార్యను సముదాయించేందుకు సింహాచలం విశ్వప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. భవాని ఆత్మహత్య చేసుకునేందుకు తీవ్రంగా యత్నించడం, ఆ ప్రయత్నాన్ని భర్త అడ్డుకుంటున్న తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.