హాలియా/తిరుమలగిరి(సాగర్), అక్టోబర్ 5 : ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దేశానికి రోల్‌మోడల్‌గా ఉండేలా నూతన చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో కొత్త రెవెన్యూ చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన తిరుమలగిరి(సాగర్) మండలంలోని నెల్లికల్లులో శనివారం రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం, ధరణి వల్ల రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.
వాటిని సవరించి, దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మెరుగైన రెవెన్యూ చట్టం తీసుకువచ్చేందుకు ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్లో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల సూచనలు సైతం పరిగణలోనికి తీసుకొని అతికొద్ది రోజుల్లో నూతన చట్టం తీసుకువస్తామన్నారు. తిరుమలగిరి(సాగర్) మండలంలో కొంతమంది పొజిషన్లో ఉన్నా పట్టాలు లేవని, పట్టాలు ఉన్న వారికి భూమి లేదని తెలిపారు.
ఎవాక్యువేషన్ ప్రాపర్టీకి సంబంధించి, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి చేస్తున్న సర్వే పూర్తయిన తరువాత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తిరుమలగిరి (సాగర్)లో 13వేల ఎకరాలకు బోగస్ పట్టా పాస్‌బుక్‌లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. తిరుమలగిరి (సాగర్) మండలంలో 3,500 నుంచి 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటుచేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని వెల్లడించారు.
నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మాత్రం 5వేల ఇండ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల పోడు వ్యవసాయంలో ఉన్న రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ అటవీ శాఖ భూములకు సంయుక్త తనిఖీలు నిర్వహించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని, రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లో గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ ధరణిలో నమోదు కాకపోవడంతో అనేక మంది రైతులు రుణమాఫీ అందలేదని, ఆ రెండు మండలాల్లోనూ సర్వే నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తిరుమలగిరి(సాగర్) మండలంలో రెవెన్యూ పనుల పురోగతిని వివరించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్నారాయణ్, వివిధ శాఖల అధికారులు, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి పాల్గొన్నారు.