కోదాడ, డిసెంబర్ 22 : కోదాడ పట్టణంలో రూ.1.25 కోట్ల వ్యయంతో ప్రాంతీయ పశు వైద్యశాల నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు. సోమవారం కోదాడ పట్టణ ప్రాంతీయ వైద్యశాలలో గొర్రెలకు నట్టల నివారణ మందును తాపించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే గొర్రెల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సకాలంలో తమ జీవాలకు నట్టల నివారణ మందును వేయించాలని కాపరులకు ఆమె సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సంక్లిష్టమైన శస్త్ర చికిత్స చేస్తూ జంతుజాలం ప్రాణాన్ని కాపాడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. పశు ఔషధ బ్యాంక్‌కు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి దామచర్ల శ్రీనివాస్, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు యర్నేని వెంకటరత్నం బాబు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, కందుల కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.