నల్లగొండ ప్రతినిధి, జనవరి24(నమస్తే తెలంగాణ) : ఈ నెల 26 నుంచి అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరి రోజు శుక్రవారం కూడా అనేక చోట్ల ప్రజలు అధికారులపై తిరుగబడ్డారు. ఇవేం జాబితాలంటూ నిలదీతలు.. అడ్డగింతలు.. ప్రభుత్వానికి శాపనార్ధాలతో గ్రామసభలు ముగిశాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం రూపొందించిన జాబితాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితాల్లోని పేర్లు ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పలేక అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. జాబితాల్లోని లబ్ధిదారుల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తగా అర్హులైన వారిని ఎందుక పరిగణలోకి తీసుకోలేదన్న ప్రజల ప్రశ్నలకు వారి నుంచి సమాధానం లేకుండా పోయింది. ప్రజలకు అక్కడికక్కడే ఏమీ చెప్పలేక మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో కొత్తగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మొత్తం 1,17,644 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠీ వెల్లడించారు. కొత్త దరఖాస్తులపై ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారనే దానిపై మాత్రం స్పష్టత కరువైంది. ఈ నెల 21 నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో రచ్చరచ్చ జరిగింది.
గ్రామసభల నిర్వహించి ప్రజల మెప్పు పొందాలని ప్రభుత్వం భావిస్తే… ప్రజలు మాత్రం మరోలా స్పందించారు. ఒక దశలో ఎందుకు గ్రామసభలు పెట్టామో అర్ధం కాని అయోమయంలోకి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు వెళ్లారు. గ్రామసభలు జరిగిన మెజార్టీ గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకతే తప్ప సానుకూలత వచ్చింది చాలా తక్కువ. ప్రభుత్వం పైనుంచి పంపిన లబ్ధిదారుల జాబితాలకు ఒక ప్రమాణికం అంటూ లేకపోవడంతో చాలామంది అర్హులకు అందులో చోటు దక్కలేదు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో అనర్హులు పథకాల జాబితాలో ఉండడంతో సామాన్యులు జీర్ణించుకోలేక పోయారు. దాంతో గ్రామాల్లో ఎవరి ప్రోద్బలం లేకుండా సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడ్డారు. పార్టీలను, రాజకీయాలను పక్కన పెట్టి అర్హులైన పేదలంతా తమ కడుపు మంటను చూపెట్టారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అధికారులు చాలా చోట్ల మిన్నకుండిపోయి జాబితాలు చదివి తమ పనైపోయిందన్న తీరును ప్రదర్శించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారిన చోట ఎక్కువ మాట్లాడితే కొత్తగా దరఖాస్తు చేసుకోండి.. తర్వాత చూద్దామన్నట్లు వ్యవహరించడం గమనార్హం.
ఇలానే నాలుగు రోజుల పాటు గ్రామసభలు కొనసాగాయి. శుక్రవారం కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అధికారులను నిలదీశారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును నిలదీస్తూ వెంటపడి తరిమి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటకగూడెంలో గ్రామస్తులు రేషన్ కార్డుల జాబితాపై అధికారులను నిలదీశారు. తమ పేర్లు ఎందుకు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపల్లి మండలం గొడుకొండ్లలో ఉదయం 11.30 గంటల వరకు అధికారులు పత్తా లేకపోవడంతో ప్రజలు మండిపడ్డారు. నకిరేకల్ మండలం తాటికల్లులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంతో పేదలు తీవ్ర వాగ్వివాదం చేశారు. పెద్దవూర, పులిచర్లలో గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. మర్రిగూడ మండలం రాజపేటతండాలో జాబితాలో అనర్హులు ఉండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పర్తి మండలం ఇండ్లూరులో ఇండ్లు, రేషన్‌కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని మండిపడ్డారు. కనగల్ మండలం బుడమర్లపల్లిలో మాజీ సర్పంచ్ కారింగు జానయ్య జాబితాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లు గల్లంతయ్యాయని పేదలతో కలిసి అధికారులను నిలదీశారు. ఇంకా చాలా గ్రామాల్లో గ్రామసభలు ప్రజల అభ్యంతరాలు, కొత్త దరకాస్తుల స్వీకరణ నడుమ కొనసాగాయి.
సూర్యాపేట జిల్లాలో కూలిన టెంట్లు
సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే సామేలుకు నిరసన సెగ తాకింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు తుంగతుర్తి మండల కేంద్రంలో గ్రామ సభకు హాజరు కాగా, ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంపటి గ్రామంలోనూ ఎమ్మెల్యే సామేలు హాజరు కాగా, గ్రామసభ రసాభాసగా మారి టెంట్‌ను కూల్చివేశారు. అన్ని అర్హతలు ఉన్నా పథకాలు ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలనుకునే వారికి నేరుగా ఇచ్చుకోవాలి తప్ప గ్రామసభలు ఎందుకు అని గ్రామస్తులు నిలదీశారు. సూర్యాపేట 14వ వార్డులో ఓ కన్నీటి పర్యంతమైంది. మహిళలను కోటీశ్వరులను చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మునగాల, కొక్కిరేణి, వెంకట్రామాపురం, జగన్నాథపురం, కోదాడ మండలం రెడ్లకుంటలో అనర్హులే పేర్లు అధికంగా ఉన్నాయని గ్రామస్తులు రచ్చరచ్చ చేశారు. ఇదే మండలంలోని రామలక్ష్మిపురంలో అర్హుల పేర్లు జాబితాలో లేవని దరఖాస్తుదారులు ఆగ్రహంతో గ్రామసభ టెంట్ కూల్చారు. నూతనకల్ మండలం అలుగూనురు గ్రామ సభలో జడ్పీ సీఈఓ అప్పారావును సన్న వడ్లకు బోనస్ రాలేదని నిలదీశారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో తాసీల్దారుతో గొడవ పడ్డారు. మఠంపల్లి మండలం వర్ధాపురం, తిరుమలగిరి 13వ వార్డు, పెన్‌పహాడ్ మండలం అనాజిపురం, నాగులపాటి అన్నారంలో అధికారులను నిలదీశారు.
వెల్లువలా కొత్త దరఖాస్తులు
నల్లగొండ జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో కొత్తగా ప్రజల నుంచి 1,17,644 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠీ శుక్రవారం వెల్లడించారు. ఇందులో రైతుభరోసా కోసం 844, రేషన్‌కార్డుల కోసం 53,844, ఇందిరమ్మ ఇండ్ల కోసం 47,471, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 15,485 దరకాస్తులు ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటన్నింటినీ త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన జాబితాల్లోని రైతుభరోసా మినహాయిస్తే మిగతా మూడు పథకాల్లోని లబ్ధిదారుల కంటే కొత్త దరఖాస్తుదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే సామేల్‌పై ప్రజాగ్రహం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలపై నిలదీశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతుండగా.. సంక్షేమ పథకాల అర్హుల పేర్లను చదివిన తర్వాతే మాట్లాడాలని అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. లిస్టులో తమ పేరు లేదని, అనర్హుల పేర్లు వచ్చాయని ప్రశ్నించడంతో సభ రచ్చరచ్చగా మారింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. దాంతో సభ అర్ధాంతరంగా ముగిసింది. అర్వపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే సామేల్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. సంక్షేమ పథకాల అర్హుల జాబితాలో తమ పేరు ఎందుకు లేదని, తాము ఎవరికి చెప్పుకోవాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరిలో వేరే ఊరి వాళ్ల పెత్తనం ఏంటని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంవారు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.