రామగిరి, జూలై 17 : నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచింది. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి చదువు కోసం వస్తుంటారు. ఈ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం డిగ్రీ ప్రథమ సంవత్సరానికి నూతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్‌లెర్నింగ్(ఏఐఎం)ను అందుబాటులోకి తెచ్చారు. దాంతో దోస్త్ అడ్మిషన్ల ద్వారా ఈ కోర్సులో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు చేరారు.
ఈ నెల 11న కళాశాలలో ఫీజు కూడా చెల్లించారు. ఇక తరగతులుకు వెళ్లాల్సిన సమయంలో కోర్సును నిర్వహించలేమంటూ కళాశాల నుంచి విద్యార్థులకు ఫోన్ వచ్చింది. దాంతో కోర్సులో చేరిన విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే దోస్త్ అడ్మిషన్లు పూర్తి కాగా మొదటి, రెండో విడుతలో తాము తీసుకున్న కోర్సును వదిలేసి రావడంతో ఎటు కాకుండా పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కోర్సు కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చి చేరిన విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు.
అనాలోచిత నిర్ణయం
ఎన్జీ కళాశాలకు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, అధ్యాపక బృందం కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యామండలి సహకారంతో కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఏఐఎం కోర్సుపై ఇక్కడ విద్యార్థులకు ఎంత అవగాహన ఉంది? అందుబాటులోకి తేస్తే విద్యార్థులు చేరుతారా? అని ఆలోచన లేకుండా తీసుకొచ్చారు. దోస్త్ ఫేజ్ – 1, 2 అడ్మిషన్లు ముగిసే వరకు విద్యార్థులు పెద్దగా అడ్మిషన్లు తీసుకోలేదనే విషయం నిర్వాహకులకు తెలుసు. తక్కువ మంది ఏఐఎంను ఎంపిక చేసుకున్నారు.
నిర్వహణ చేయలేమని ఆలోచనతో ముందస్తుగానే ఫేజ్-3లో ఆ కోర్సును దోస్త్ నుంచి తొలగించి ఉంటే విద్యార్థులు ఆ కోర్సును ఎంపిక చేసుకుండా ఉండేవారు. తీరా కోర్సులో చేరిన తర్వాత వేరే కోర్సులోకి వెళ్లండని చెప్పడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే దోస్త్ అడ్మిషన్లు చాలా వరకు పూర్తికాగా నచ్చని కోర్సుల్లో ఎలా చేరాలని, ముందే కోర్సును దోస్త్ నుంచి తొలగిస్తే తమకు న్యాయం జరిగేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15మంది కంటే తక్కువ ఉంటే కోర్సు నిర్వహించలేం
ఎన్జీ కళాశాలలో ఏఐఎం కోర్సును ఈ విద్యా సంవత్సరం అందుబాటులోకి తెచ్చాం. దోస్త్ చివరి ఫేజ్ ముగిసే వరకు ఆ కోర్సులో ఆరుగురు విద్యార్థులు మాత్రమే చేరారు. 15మందికి తక్కువ విద్యార్థులుంటే కోర్సు నిర్వహించడం కష్టం. దీనికి సంబంధించి ఉన్నత విద్యామండలి నిబంధనలు కూడా ఉన్నాయి. నేటి ఆధునిక కాలానికి అవసరమైన కోర్సు అయినప్పటికీ విద్యార్థులు ఎందుకు ఎంపిక చేసుకోలేదో అర్థం కావడం లేదు.
– సముద్రాల ఉపేందర్, ప్రిన్సిపాల్, ఎన్జీ కళాశాల, నల్లగొండ
డాటా సైన్స్‌లో సీటు వదిలేసి వచ్చిన
మాది హైదరాబాద్. నేను దోస్త్ ద్వారా నిజాం కళాశాలలో బీఎస్సీ డాటా సైన్స్‌లో సీటు సాధించాను. నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఏఐఎం కోర్సు అందుబాటులోకి తేవడంతో దోస్త్ చివరి ఫేజ్‌లో దరఖాస్తు చేశా. అందులో నాకు సీటు వచ్చింది. ఈ నెల 11న కళాశాలకు వచ్చి ఫీజు చెల్లించి చేరాను. కోర్సుపై ఆసక్తితో నాన్‌లోకల్ అయినప్పటికీ భవిష్యత్ ఉంటుందని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనుకున్నా.
‘ఇప్పుడు కోర్సు నిర్వహించలేము.. మీరు ఇదే కళాశాలలో వేరే కోర్సులో చేరండి’ అని కళాశాల నుంచి ఫోన్ చేశారు. వేరే కోర్సు చేయాలంటే నేను హైదరాబాద్‌లోనే ఉండేదాన్ని. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా? వేరే కోర్సులో చేరాలంటే దోస్త్ అడ్మిషన్లు పూర్తిగా ముగిశాయి. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుల అనాలోచిత నిర్ణయం నా చదువు నాశం చేసేలా ఉంది. ఎంజీయూ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఏఐఎం కోర్సు కొనసాగించి విద్యార్థులకు న్యాయం చేయాలి.
– రుహినాబాను, విద్యార్థిని, హైదరాబాద్