సూర్యాపేటటౌన్, జూలై 27 : సూర్యాపేటలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పొలీసులు ఓ మహిళను అరెస్టు చేసి రూ. 14 లక్షల విలువైన 14 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలో ఈ నెల 21వ తేదీ ఆదివారం రాత్రి బంగారం షాపులో చోరీ జరిగింది. మరుసటి రోజు చోరీ జరిగిన విషయం గుర్తించిన జ్యువెలరీ షాపు యజమాని 2.5కి లోల బంగారం, నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సూర్యాపేట టౌన్ 2 పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా 5ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో సూర్యాపేట పోలీసులు హైటెక్ బస్టాండ్‌లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ మహిళను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమెను ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోదగా గుర్తించారు . ఆమెను తనిఖీ చేయగా సుమారు 14 తులాల బంగారు అభరణాలు లభించాయి.
వాటిని సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులోని ఆభరణాలుగా గుర్తించారు. ఆమెను మరింత విచారించగా నేపాల్‌కు చెందిన ప్రకాష్ అనిల్‌కుమార్, మరో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులతో కలిసి చోరీ చేసినట్లు తేలిందన్నారు. నేపాల్‌కు వెళ్లే క్రమంలో ఖమ్మం వద్ద ప్రకాష్ అనిల్‌కుమార్ తనకు కొన్ని నగలు ఇచ్చారని సదరు మహిళ అంగీకరించిందన్నారు.
ఖమ్మంలో విక్రయిస్తే గుర్తిస్తారని తెలిసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఖమ్మం నుంచి సూర్యాపేట మీదుగా వెళుతుండగా హైటెక్ బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. నేపాల్‌కు చెందిన అమర్ భట్, ఖమ్మంలో గుర్ఖాగా పని చేస్తుండేవాడని, ప్రకాష్ అనిల్‌కుమార్ సంవత్సరం క్రితం వచ్చి ఖమ్మంలో గుర్ఖాగా పని చేస్తూ సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. దీంతో ఆమె ఆయనకు ఆశ్రయం ఇచ్చి చోరీల విషయంలో సహకరించేదన్నారు.
గోల్డ్ షాపులో చోరీకి ప్రధాన కారకుడు ప్రకాష్ అనిల్‌కుమార్ అని గుర్తించామన్నారు. అనిల్ కుమార్, అమర్ భట్ ఇద్దరు ఖమ్మలో తిరుగుతూ బ్యాంకులు, నగల దుకాణాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అమర్భట్ రెక్కీ నిర్వహించి చోరీకి ప్లాన్ వేసేవాడన్నారు. గత మే నెల మొదటి వారంలో ప్రకాష్ అనిల్‌కుమార్, అమర్భట్, యశోదతో కలసి సూర్యాపేటలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెడుతున్నామని, గుర్ఖాగా పనిచేస్తున్నామని చెప్పి, ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నమ్మ బలికి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు.
మే చివరి వారంలో మళ్లీ సూర్యాపేటకు వచ్చి ఇంటి అద్దె కట్టి రెక్కీ నిర్వహించి ఖమ్మం వెళ్లారు. ఈ క్రమంలో ప్రకాష్ అనిల్‌కుమార్‌తో పాటు జార్ఖండ్‌కు చెందిన కడక్ సింగ్, మరో ముగ్గురు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులతో కలసి సాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు వెళ్లి విక్రయిస్తామని వారు అమర్భట్, యశోదకు చెపారు. ఖర్చుల కోసం యశోదకు కొంత బంగారం ఇచ్చి, నిందితులు నేపాల్ వెళ్లారని పోలీసులు తెలిపారు.
అమ్మిన తరువాత మిగతా భాగం ఇస్తామని అనిల్‌కుమార్ చెప్పాడన్నారు. ఈ చోరీ కేసులో నేపాల్, జార్ఖండ్, యూపీ రాష్ర్టాలకు చెందిన ఐదుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించామని వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. చోరీ కేసులో ప్రకాష్ అనిల్‌కుమార్, కడాక్ సింగ్, మరో ముగ్గురు నిందితులతో పాటు ఖమ్మం పట్టణానికి చెందిన అమర్ భట్, మేకల యశోద ఉన్నారన్నారు. ప్రధాన నిందితుడు ప్రకాష్ అనిల్‌కుమార్‌పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు చోరీ కేసులున్నాయని, వాటిని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ, పోలీసు సిబ్బంది ఉన్నారు.