రామగిరి, మే 19 : విధుల్లో నిర్లక్ష్యం వహించారని, దానిపై వివరణ ఇవ్వాలని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల ఎంఈఓలతోపాటు మాల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఫ్రధానోపాధ్యాయురాలుకు సోమవారం విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ ఇ.విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చింతపల్లి ఎంఈఓ నీరుడు అంజయ్య, మర్రిగూడ ఎంఈఓ బిట్టు శ్రీనివాస్, మాల్ (వెంకటేశ్వరనగర్) జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ముసిని కృష్ణమ్మ విధుల పట్ల నిర్లక్ష్యంగా, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారని నోటీసులో పేర్కొన్నారు. చింతపల్లి, మర్రిగూడ ఎంఈఓలు ఇద్దరు ఆయా మండలాల పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో 10వ తరగతి గదిలోనే ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. మాల్ జడ్పీహెచ్ఎస్ ప్రధాన నోపాధ్యాయురాలు ముసిని కృష్ణమ్మ కూడా పీఆర్యూ సంఘంలో ఎన్నికై అలాగే వ్యవహరించినట్లు పేర్కొన్నారు. టీఎస్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నియమాలు 1991 ప్రకారం అధికారం వినియోగించుకుంటూ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చూపినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలుపాలని తెలిపారు. షోకాజ్ నోటీసులపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసుల విషయం గోప్యంగా ఉంచినట్లు పలు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.