రామగిరి/సూర్యాపేట, మే 4 : వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2025 ఆదివారం సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేయగా ఏ సమస్య లేకుండా పరీక్ష పూర్తయ్యింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగగా విద్యార్థులను 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు లోపలికి పంపించారు. విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏడు సెంటర్లలో 2,087 మందికి 2006.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నాలుగు సెంటర్లలో 890 మందికి 859 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నగలు, ఆభరణాలు, చెవుల రింగులు వేసుకొని వచ్చిన విద్యార్థుల నుంచి వాటిని తొలగించిన తర్వాతే లోపలికి పంపించారు. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరీక్ష తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్ష పత్రాలను భారీ బందోబస్తు నడుమ తరలించారు. నల్లగొండ అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, నల్లగొండ, సూర్యాపేట అదనపు ఎస్పీలు రమేశ్, నాగేశ్వర్రావు, నల్లగొండ, సూర్యాపేట ఆర్డీఓలు వై .అశోక్ రెడ్డి, వేణుమాధవ రావు, తాసీల్దార హరిబాబు, నీట్ నోడల్ అధికారి శ్రీనివాస్ పరీక్ష విధుల్లో పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నీట్ పరీక్ష కోసం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ప్రధాన గేటు నుంచి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ సైన్స్ సోషల్ సైన్స్, యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ పరీక్ష కేంద్రాలు సుమారు అర కిలోమీటర్పైనే ఉంటాయి. కేవలం ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి మాత్రమే ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను ఏర్పాటు చేసిన యూనివర్సిటీ అధికారులు మిగిలిన కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులను ప్రధాన ద్వారం నుంచే నడిపించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో అర కిలోమీటర్‌పైగా నడవడంతో విద్యార్థుల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఇద్దరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.పోలీసుల అత్యుత్సాహమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
చాలామంది విద్యార్థులు స్లిప్పర్స్ వేసుకుని వచ్చినప్పటికీ వాటిని సైతం ప్రధాన ద్వారం వద్ద విప్పించి ఎండలోనే అరకిలోమీటర్ నడిపించారు. తల్లిదండ్రులు తమ వాహనాల్లో లోపలికి వెళ్లి దింపి వస్తామన్నప్పటికీ పోలీసులతోపాటు యూనివర్సిటీ అధికారులు నిరాకరించారు. మరోవైపు పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థుల నుంచి అడ్మిట్ కార్డులను ఆయా యూనివర్సిటీలు తీసుకోవాలి. కానీ యూనివర్సిటీ కామర్స్ కళాశాలలోని కొన్ని రూములలో అడ్మిట్ కార్డులను తీసుకోకుండానే బయటికి పంపించినట్లు విద్యార్థులు తెలిపారు. ఇక విద్యార్థుల చేత తీసుకోవాల్సిన ఫార్మేట్ అంశాలను కూడా అర్థగంటపైగా లేట్ చేయడంతో పరీక్ష సరిగా రాలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.