పాలకవీడు, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం అవగాహన సమావేశాల్లో రైతులు కనబడడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే పలు మండలాల్లో భూ భారతి చట్టం అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ అవగాహన సమావేశాలకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్వయంగా హాజరై భూ భారతి చట్టంపై అవగాహన కలిగిస్తున్నారు. కానీ అవగాహన సమావేశాలకు రైతులు హాజరు కావడం లేదు. దీంతో సమావేశాలు విజయవంతం కావడానికి, కలెక్టర్ ఆగ్రహానికి గురికాకుండా ఉండడానికి అధికారులు బలవంతంగా ఆయా మండలాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, వీబీకేలు, రేషన్ డీలర్లను భూ భారతి అవగాహన సమావేశాలకు హాజరు పరుస్తున్నారు. శనివారం పాలకీడు మండలంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సమావేశంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎక్కువ శాతం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, రేషన్ డీలర్లు మాత్రమే కనిపించారు. రైతులు అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. సమావేశానంతరం పలువురు అంగన్వాడీలు, ఆశ వర్కర్లను పలుకరించగా రైతులు ఈ సమావేశాలకు హాజరైతే వారికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ, మండువేసవిలో తమను ఇలా బలవంతంగా సమావేశాలు హాజరుపరచడం బాధాకరంగా ఉందన్నారు. ఈ సమావేశాలకు హాజరు కావాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రేషన్ డీలర్లకు, భూభారతి చట్టానికి ఏం సంబంధం వారు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూ భారతి చట్టం అవగాహన సమావేశాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.