రామగిరి, మే 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రస్తుత వీసీ చొల్లేటి గోపాల్‌రెడ్డి పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఐఏఎస్ నవీన్ మిట్టల్‌ను ఇన్చార్జి వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా పది యూనివర్సిటీలకు 2021 మే 22న వైస్ చాన్స్లర్ల నియామకం చేయగా వారి పరిపాలనకు తెరపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆయా యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎంజీయూకు ఐఏఎస్ నవీన్‌మిట్టల్‌ను నియమించింది. అధికారికంగా ఆయన బుధవారం ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవీన్ మిట్టల్ ఎంజీయూకు ఆరో ఇన్చార్జి ఐఏఎస్ కావడం గమనార్హం. ప్రస్తుత వీసీకి ఎంజీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితోపాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేస్తునట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆయన 2021 మే 24నుంచి 2024 మే 21వరకు వీసీగా పనిచేశారు.