నార్కట్పల్లి, మార్చి 29 : రోజురోజుకు ఎండలు ముదురుతుండటంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటలకు నీళ్లు అందక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. నార్కట్పల్లి మండలం నీళ్లు లేక కరువు కోరల్లో చిక్కుకుంది. మండలంలోని నెమ్మాని, జువ్విగూడెం, చిన్నతుమ్మల గూడెం, వెంకటేశ్వర్ల బావి గ్రామాల్లో వరి పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక బర్రెలను, గొర్రెలను మేపుతున్నారు. గతంలో పుష్కలంగా నీళ్లు ఉండడంతో రెండు పంటలకు సాగు చేసుకోగా ఇప్పుడు యాసంగికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది.
మండలంలోని 20వేల ఎకరాల వరకు వరి సాగు చేయగా ఇప్పటికే చాలా ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయాయి. అప్పులు చేసిన పంటలు సాగు చేశామని, ఇప్పుడు వాటిని ఎలా తీర్చాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు. గతంలో బోర్లు బావులు ఎండిపోకుండా వర్షాలు బాగా పడ్డాయి. నేను మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. బోరు మొదట్లో బాగా పోసేది. ప్రస్తుతం తగ్గు ముఖం పట్టి మధ్యలోనే పూర్తిగా ఎండపోయింది. అప్పు చేసి సాగు చేసిన. నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
– సామపాక యాదయ్య, రైతు, చిన్నతుమ్మలగూడెం, నార్కట్పల్లి మండలం
భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయాయి. నేను రెండెకరాల్లో వరి వేయడంతో నీళ్లు లేక ఎండిపోయింది. నెల రోజులు నీళ్లు సరిగా ఉంటే పంట చేతికి వచ్చేది. ఇప్పుడు మేత కోసం పొలాన్ని వదిలేసిన. అప్పులు చేసి సాగు చేసిన. అప్పులు పెరిగిపోతున్నాయి. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు, అధికారులు పంటను పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం అందించి ఆదుకోవాలి.
– దాసరి ఐలయ్య, రైతు చిన్నతుమ్మలగూడెం, నార్కట్పల్లి మండలం