బీబీనగర్, జూలై 7: భువనగిరి మాజీ ఎమ్మె ల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిరాడంబర నేత కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలం గా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రజా సమస్యల పరిషారమే జీవిత లక్ష్యంగా భావించి, పదవులను ప్రజాసేవకు వేదికగా మలిచిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి నరసింహారెడ్డి రామచంద్రరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు నాలుగో సంతానంగా ఆయన జన్మించారు. భార్య సుకన్య. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆస్తులు కూడబెట్టకుండా, ఒక పాత సూటర్ మినహా సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు.
19 ఏళ్లకే సర్పంచ్..
కొమ్మిడి నరసింహారెడ్డి కేవలం 19 ఏళ్ల వయసులోనే బ్రాహ్మణపల్లి సర్పంచ్ గా ఎన్నికై ప్రజాజీవితంలో అడుగుపెట్టారు. 1967లో రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
రెండుసార్లు ఎమ్మెల్యే..
1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978 నుంచి 1985 వరకు ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆయన, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించేవారు.
సాగునీటి కోసం వినూత్న ప్రణాళిక
తెలంగాణలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిషారం కోసం ఆయన జీవితాంతం అధ్యయ నం చేశారు. గోదావరి జలాలను మూసీలోకి మళ్లించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించారు. భారీ వ్యయం లేకుండా అమలు చేయగల మార్గాన్ని సూచిస్తూ స్వయంగా బ్లూ ప్రింట్లు, మ్యాపులు రూపొందించి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించేవారు. నీటి పారుదల వ్యవస్థపై ఆయనకు ఉన్న అవగాహనను పలువురు ఇంజినీర్లు సైతం ప్రశంసించేవారు.
భుజాన సంచీ.. చేతిలో పుస్తకం..
భుజానికి చిన్న సంచి, అందులో ఒక జత బట్టలు, సద్దికట్టుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలకు ఆయన హాజరవుతుండేవారు. సభల్లో మాట్లాడిన అంశాలను చిన్న నోటు పుస్తకంలో నమోదు చేసుకుంటూ జీవితాం తం విద్యార్థిలా నేర్చుకుంటూ ప్రజా సమస్యలకు పరిషారాలను అన్వేషించారు.
నిమ్స్ కోసం ఆమరణ దీక్ష..
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో నిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆరోగ్యం, విద్య, సాగునీరు, రైతు సంక్షేమం వంటి అంశాలపై ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
ప్రజల గుండెల్లో స్థానం..
రాజకీయాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాసేవ కోసం వినియోగించిన నాయకుడిగా కొమ్మిడి చిరస్థాయిగా నిలిచారు. కొమ్మిడి నరసింహారెడ్డి మృతితో బ్రాహ్మణపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.