నల్లగొండ : ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో గతంలో కనివిని ఎరుగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని చట్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు కనుమరుగయ్యేలా నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. ఇది తెలుగు భాష మనుగడకు తీవ్ర ప్రమాదం అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల పిల్లలకు ఇటు తెలుగు రాక అటు సంస్కృతం రాక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఈ ప్రకటన ఇచ్చిన వారిలో తెలుగు ఫోరం ప్రతినిధులు పోతురాజు వెంకులు, శీలం భద్రయ్య, కొప్పుల యాదయ్య డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ కనకటి రామకృష్ణ, పొడిచేటి శంకర్, దాసోజు రవికుమార్, ఏ చంద్రశేఖర్, మాధురి, రేణుక, అరుణ కుమారి తదితరులు ఉన్నారు.