నల్లగొండ, ఏప్రిల్ 21 : లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, స్థానిక కేబుల్ చానల్స్, ఎఫ్ఎం రేడియో, ఇతర ఆన్లైన్ మీడియా, బల్ ఎస్ఎంఎస్లు, వీడియో మెసేజ్లు, సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్స్, కరపత్రాల ముద్రణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతిని తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం నల్లగొండ కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కరపత్రాలను ముద్రించినట్లయితే సంబంధిత ప్రచురణకర్తపై చర్యలు ఉంటాయని చెప్పారు.