రామగిరి, జూలై 18 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) వ్యవస్ధాపక దినోత్సవం, టాపర్స్‌కు గోల్డ్ మెడల్ పంపిణీ ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. శుక్రవారం కళాశాలలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కళాశాలలోని 27 యూజీ, 6 పీజీ కోర్సుల్లో 4 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివి ఆయా కోర్సులో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ పంపిణీని కళాశాల పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో 2021-2025 బ్యాచ్ వరకు మొత్తం 83 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా దాతలు బంగారు పతకాల పంపిణీకి ముందుకు వచ్చి రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీతో ప్రతి ఏడాది వారు సూచించిన పేరుతో విద్యార్థులకు గోల్డ్ మెడల్ బహూకరించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే వ్యవస్ధాపక దినోత్సవం, గోల్డ్ మెడల్ పంపిణీనికి ముఖ్య అతిథిగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, గౌరవ అతిథులుగా తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ డీఎస్ ఆర్ రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ పి.బాలబాస్కర్, ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య విశ్రాంత ఆర్జేడీ ప్రొ. జి.యాదగిరి తదితరులు హాజరువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కళాశాల సీఓఈ డాక్టర్ బి.నాగరాజు, తెలుగు విభాగం సీనియర్ అధ్యాపకులు వెల్డండ శ్రీదర్ పాల్గొన్నారు.