– గంధం ఊరేగింపుతో ప్రారంభం కానున్న వేడుకలు
– హాజరు కానున్న మంత్రి, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రముఖులు
రామగిరి, అక్టోబర్ 08 : నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో గల లతీఫ్సాబ్ గుట్టపైన ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. జిల్లాతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి హిందూ, ముస్లింలు వేడుకలకు హాజరు కానున్నారు. ఇందుకు ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. దర్గాను ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు.
ఈ నెల 9న ప్రారంభమయ్యే ఉర్సు ఉత్సవాలు అధికారికంగా 5 రోజులు కొనసాగినప్పటికీ, మాసం పాటు ఉర్సు సందడి కొనసాగనుంది. తొలి రోజు గడియారం సెంటర్ సమీపంలోని మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్ధన చేసి సాయంత్రం 5.30ని.లకు గంధం ఊరేగింపు ప్రారంభిస్తారు. తొలి రోజు గంధం కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్, ఎస్సీ, ప్రజాప్రతినిదులు హాజరవుతారు. 10వ తేదీన దర్గా మెట్ల వద్ద దీపాల వెలిగింపు, 11వ తేదీ రాత్రి కవ్వాలి ఉంటుంది. అలాగే ప్రతి రోజు రాత్రి ముస్లిం మత గురువులు ఖురాన్ సందేశాన్ని వినిపిస్తారు.