నల్లగొండ సిటీ, జనవరి 1 : నల్లగొండ జిల్లా కొత్త ఎస్పీగా చందనా దీప్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని సోమవారం పోలీస్ హెడ్ క్వాటర్లో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి సిబ్బంది, ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికడుతామన్నారు. గంజాయి మాదక ద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, దాని నిర్మూళనకు స్పెషల్ ట్రాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో నేషనల్ హైవేలు ఎక్కువ ఉండడంతో ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దొంగతనాల నివారణకు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇండ్లు, షాపుల యజమానులు సొంతంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం మంచిదని సూచించారు. సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు ప్రత్యేక ట్రాస్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందితో సమీక్షించి జిల్లాలో నేరాల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరి సహాయ సహకారాలు అవసరమని తెలిపారు. ఎస్పీగా చందనా దీప్తి నియామకం కావడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.