భువనగిరి అర్బన్, డిసెంబర్ 17:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఉమ్మడి జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రజలకు ఏం అవసరమో గుర్తించి వెంటనే సమకూర్చుతున్నది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పంపగా.. వెంటనే నిధులు మంజూరు చేసింది. ఆ వెంటనే పనులు ప్రారంభించగా.. అన్నీ పూర్తయి
తుది దశకు చేరాయి.
అధునాతన సౌకర్యాలతో 185 స్టాల్స్
భువనగిరి పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, మాంసం ఒకేచోట లభించేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్‌ను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నది. ఈ మార్కెట్లో కూరగాయల కోసం 125 స్టాల్స్, మాంసం, చికెన్, చేపల అమ్మకాలకు 40, చిరుధాన్యాల విక్రయం కోసం 20 స్టాల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మాంసం, చికెన్, చేపలు, చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ పనులు పూర్తయ్యాయి. కూరగాయల స్టాల్స్ ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు ఫుడ్ క్యాంటిన్ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ వద్ద నీటి సౌకర్యంతోపాటు కూలింగ్ కోసం సెంట్రలైజ్డ్ ఏసీ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వస్తువుల ధరలను తెలియజేసేందుకు డిజిటల్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు 15 రోజుల్లో పూర్తి కానున్నాయి.
మార్కెట్ ఆవరణలో మొక్కల పెంపకం, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. సమీకృత మార్కెట్లో పట్టణంలోని వీధి వ్యాపారులు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చిరు వ్యాపారులు, వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి. భువనగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల సరుకులు నిర్ణీత ధరతో ఒకేచోట లభిస్తాయి. దాంతో వినియోగదారులకు సమయం ఆదాతోపాటు రిస్క్ తప్పనుంది.
పట్టణంలోని వినియోగదారులకు కావాల్సిన సరుకులన్నీ ఒకేచోట లభించే విధంగా భువనగిరి రహదారి బంగ్లా ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో రూ.8.70 కోట్లతో సమీకృత (ఇంటిగ్రేటెడ్) మార్కెట్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులకు 2019 అక్టోబర్ 2న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సంవత్సరంలో పూర్తి చేయాల్సి ఉండగా.. కరోనా కారణంగా కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత పనులను వేగవంతం చేయగా.. ప్రస్తుతం చివరి దశకు వచ్చాయి.
15 రోజుల్లో మార్కెట్ ప్రారంభం
భువనగిరి మున్సిపాలిటీలో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అందులో మటన్, చికెన్, చేపలు, కూరగాయల స్టాల్స్.. లైటింగ్, స్విచ్బోర్డులతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా వారంలో పూర్తవుతాయి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో మార్కెట్ ప్రారంభం కానుంది.
– బి.నాగిరెడ్డి, భువనగిరి మున్సిపల్ కమిషనర్