రామగిరి, నవంబర్ 22 ;ఎముకలు కొరికే చలిలోనూ సడలని సంకల్పంతో పడుతున్న అడుగులవి. కొలువు వేటలో చిరుత వేగాన్ని తలపించే పరుగులవి. 12-13 డిగ్రీల చలిలోనూ చెమటలు తీస్తున్నటువంటి కఠోర కసరత్తు అది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేదు. లక్ష్యం ఒక్కటే పోలీస్ కొలువు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన యువతరం యూనిఫామ్ జాబ్ ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పల్లె రోడ్ల వెంట పరుగులు తీస్తున్నది. పట్టణాల్లో అయితే గ్రౌండ్లన్నీ స్పోర్ట్స్ మీట్‌ను మరిపిస్తున్నాయి. రన్నింగ్,హై జంప్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ ప్రాక్టీస్ చేస్తున్న వందలాది మందితో కొత్త ఉత్తేజాన్ని నింపుకొంటున్నాయి. ప్రభుత్వ కొలువు సాధించి ఉన్నత స్థాయికి ఎదుగాలని, పోలీస్ ఉద్యోగంలో చేరి ప్రజా రక్షణ, సమాజ శాంతి భద్రతల పరిక్షణలో భాగస్వాములు కావాలని ఆరాటపడుతూ ఈవెంట్స్‌కు సిద్ధమవవుతున్న అభ్యర్థులపై ప్రత్యేక కథనం.
ప్రభుత్వ కొలువు సాధించాలనేదే వారందరి సంకల్పం. లక్ష్య సాధన కోసం వారు నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈవెంట్స్‌లో సత్తా చాటేందుకు నిరంతర సాధన చేస్తున్నారు. రన్నింగ్,
ఇతర ఈవెంట్స్ సాధన చేస్తున్న వారితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడా మైదానాలు, ఖాళీ ప్రదేశాలు సందడిగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు 54,253మంది ఉన్నారు. వీరిలో 10వేలకుపైగా అమ్మాయిలే. వారంతా ఉద్యోగం సాధించాలనే సంకల్పం, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు.
ఎన్జీ కళాశాలలో సందడి..
నల్లగొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే సందడి కనిపిస్తుంది. పోలీసు ఉద్యోగార్థులతోపాటు స్థానిక ప్రజలు, ఉద్యోగులు, యువత, చిన్న పిల్లలు వ్యాయామం చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి రోజు ఉదయం 4 నుంచి 8గంటల వరకు, సాయంత్రం 4నుంచి రాత్రి 9 గంటల వరకు కాలేజీ మైదానం రద్దీగా ఉంటుంది. ఇక్కడ 500మందికి పైగా పోలీస్ ఉద్యోగార్థులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలోని మైదానం, గొల్లగూడలోని అవుట్డోర్ స్టేడియంలో అభ్యర్థులు సాధన చేస్తున్నారు. ఎన్జీ కళాశాల మైదానంలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల జడ్పీహెచ్ఎస్లో పీఈటీగా పనిచేస్తున్న టి.శంభులింగం రోజూ ఉదయం, సాయంత్రం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
ఈవెంట్స్‌పై పట్టు సాధించాం
ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన నేను ఈవెంట్స్ కోసం రెండు నెలల నుంచి మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టీస్ చేస్తున్నా. మొదట ఒక్కడినే ప్రాక్టీస్ చేసేది. ఎన్బీఆర్ ఫౌండేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని మిత్రులతో కలిసి అందులో చేరా. ట్రైనింగ్‌లో మొదట త్వరగా అలసిపోవడం, శ్వాస, బాడీ పెయిన్స్‌తో ఇబ్బంది పడేవాళ్లం. ట్రైనర్ల సూచనలు, వామప్‌తో వాటి నుంచి త్వరగా బయటపడ్డాం. శిక్షకుల సమక్షంలో రన్నింగ్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్, తదితర ఫిజికల్ టెస్ట్‌లపై పట్టు సాధించాం. ఫిజికల్ టెస్ట్‌లో కొత్తగా చేర్చిన స్కోరింగ్ పార్ట్ అయిన 1600 మీటర్ల పరుగుపందేన్ని 7నిమిషాల 15 సెకండ్ల కంటే ముందే చేరుకుంటున్నా.
– మేళ్ల ప్రశాంత్, శాంతినగర్, మిర్యాలగూడ
ఈవెంట్స్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలి
పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ సమయంలో కచ్చితంగా ఆరోగ్య నియమాలు పాటించాలి. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలంటేనే రన్నింగ్‌తోపాటు ఇతర ఈవెంట్స్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఒంటరిగా పరిగెత్తుతుంటారు. అలాకాకుండా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి మాట్లాడుకుంటూ పరుగు తీయాలి. దాంతో అలసట రాదు. గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం పడకుండా ఉంటుంది. దీర్ఘకాలిక (కీళ్లు, కాళ్ల నొప్పులు, ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల) వ్యాధులతో ఇబ్బంది పడేవారు పోలీసు ఉద్యోగ సాధనకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే పరుగెత్తే సమయంలో అలసట వచ్చి కొన్ని సందర్భాల్లో గుండె ఆగే పరిస్థితి ఉంటుంది.
చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. దీనికి శరీర అవయవాలను ఆడిస్తూ వామప్ చేయాలి. పరుగెత్తే ముందు చిన్నగా ప్రారంభించి క్రమేణా వేగం పెంచుతూ నిర్ణీత సయమం పాటిస్తూ గమ్యం చేరుకునేలా ప్రాక్టీస్ చేయాలి. మరోవైపు నిత్యం ఆహారంలో 40శాతం ప్రొటీన్లు, 30శాతం విటమిన్లు, 30శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా పౌష్టికాహారం తీసుకోవాలి. శారీరక విశ్రాంతి కోసం సరైన నిద్ర (రోజులో 7గంటలు) ఉండాలి. మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో రాత్రివేళల్లో ఎక్కువ సమయం కాకుండా పగలు చదువాలి. దీంతో కండ్లపై ప్రభావం తగ్గుతుంది. ఇలా ప్రతి అంశంలో నియమాలు పాటిస్తూ నిపుణుల సలహాలతో ముందుకు సాగితే ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
– డాక్టర్ మాతృనాయక్, జనరల్ ఫిజీషియన్ &మెడికల్ స్పెషలిస్ట్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండ
పోలీస్ ఉద్యోగ సాధనలో ఈవెంట్స్ చాలా ప్రాధానమైనవి
పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈవెంట్స్‌పై కచ్చితంగా శ్రద్ధ చూపాలి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా తొలుత రన్నింగ్ ఉంటుంది. అందులో నిర్ణీత సమయంలో పరుగు తీసి విజయం సాధిస్తేనే మిగిలిన అంశాల్లో రాణిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ సామర్థ్యం మేరకు వీటిని కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరో వైపు మెయిన్‌లో విజయం సాధించాలంటే అందుకు సంబంధించిన అంశాల్లో ప్రణాళిక ప్రకారం చదువాలి. రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదివి రోజువారీగా ప్రాక్టీస్ బిట్స్ పూర్తి చేయాలి. ఏదైనా ఇష్టంతో చదివితే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సొంత ప్రణాళికతో చదువాలి.
– వి.నర్సింహారెడ్డి, డీఎస్పీ, నల్లగొండ
నాలుగు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నా
గతంలో కొద్దిలో పోలీస్ ఉద్యోగం చేజారింది. ఈ పర్యాయం అలా జరుగకుండా నాలుగు నెలలుగా నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ సారి పోటీ బాగా పెరిగింది. ఆ పోటీని ఎదుర్కొని ఉద్యోగం సాధించాలంటే ప్రతి అంశం చాలా క్లిష్టమైంది. ఆ దిశగా ఈవెంట్స్ సాధన చేస్తూ మెయిన్స్‌కు ప్రత్యేక ప్రణాళికతో చదువుతున్నా.
– సంకు సుబ్బారావు, నాయుడుపాలెం, అనుముల మండలం
పీఈటీ సర్ సూచనలతో
మాది పీఏపల్లి మండలంలోని మాదాపురం. నేను నల్లగొండలో ఉంటూ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించా. ఈవెంట్స్‌లో రాణించేందుకు ఎన్జీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తున్నా. ఇక్కడికి వస్తున్న వందల మంది అభ్యర్థులతో కలిసి విజయ సాధనకు అవసరమైన అంశాలను తెలుసుకుంటున్నా. గతంలో ఈవెంట్స్‌లో కొద్ది తేడాతో ఉద్యోగం చేజారింది. ఇప్పుడలా జరుగకుండా పీఈటీ శంభులింగం సూచనలతో సాధన చేస్తున్నా.
– రమావత్ కృష్ణ, మాదాపురం, పీఏపల్లి (మం), నల్లగొండ జిల్లా
రోజూ 8గంటలు ప్రాక్టీస్
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేస్తుండడం హర్షణీయం. గతంలో రెండు సార్లు ఉద్యోగం కోల్పోయా. ఈసారి నల్లగొండలో స్నేహితులతో కలిసి ఉంటూ ఎన్జీ కళాశాల మైదానంలో నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నా. ఉద్యోగం సాధించాలనే సంకల్ప బలమే నాలో ఆత్మసైర్థ్యం పెంచుతుంది. రోజు 8 గంటలపాటు ప్రాక్టీస్ చేస్తున్నా.
– భూక్యా నరేశ్, కొత్తగూడెం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
ఇంజినీరింగ్ చేసి ఉద్యోగానికి..
ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నేను ప్రైవేటు ఉద్యోగంతో జీవితానికి భద్రత లేదనుకున్నా. ప్రభుత్వ ఉద్యోగంతో జీవితాంతం భరోసా ఉంటుందని పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. తొలి విడుత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి పోలీసు కొలువు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నా. ఉద్యోగం తప్పక సాధిస్తాననే నమ్మకం ఉంది.
– త్రివేణి, గణపవరం, కోదాడ మండలం
పోలీస్ జాబే లక్ష్యం
మాది పేద వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు కాయ కష్టం చేసి నన్ను ఉన్నత చదువులు చదివించారు. మొదట హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మా తల్లిదండ్రుల కోరిక. పబ్లిక్ సర్వీస్ చేయాలనే సంకల్పంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశా. పోయినసారి ఒక్క మార్కుతో ఎస్ఐ జాబ్ మిస్ అయ్యింది. ఈ సారి కచ్చితంగా సాధిస్తా. ఎస్ఐ జాబ్ కోసం ఫిజికల్ ఈవెంట్స్‌లో నెగ్గేందుకు కఠోర సాధన చేస్తున్నా. తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. పోలీస్ ఉద్యోగం సాధించి మా అమ్మనాన్నల పేరు నిలబెడుతా.
–మన్నె ప్రభాకర్, నెమిల, రాజాపేట మండలం
పోలీస్ అవ్వాలన్నది నా కల
పోలీసు ఉద్యోగం సాధించాలనేదే నా కల. మా తల్లిదండ్రులు సైతం నాకు ధైర్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారు. అందుకే మిర్యాలగూడ నుంచి నల్లగొండ వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. పోలీసు ఉద్యోగం సాధించాలంటే ఈవెంట్స్ చాలా ముఖ్యం. అందుకే నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడికి వందల మంది అభ్యర్థులు వస్తుండడంతో నాలో సంకల్ప బలం మరింత పెరిగి ఉద్యోగం సాధిస్తాననే నమ్మం కలుగుతుంది.
– తేజావత్ రాంబాయి, మిర్యాలగూడ