చిట్యాల, నవంబర్ 17 : చిట్యాల, నకిరేకల్ సమీకృత మార్కెట్లను సంక్రాంతి పండుగ వరకు అందుబాటులోకి తీసుకువస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం సాయంత్రం ఆయన చిట్యాలలోని సమీకృత మార్కెట్ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లకు పనులు వేగంగా పూర్తి చేయాలని చేయాలని అదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉదయ సముద్రం పెండింగ్ పనుల కోసం రూ. 80 కోట్లు, భూసేకరణ కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ మార్కెట్ల పూర్తి కోసం అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. పట్టణ ప్రజల సౌకార్యర్థం సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. చిట్యాల -భువనగిరి రోడ్డును డబుల్ రోడ్డు చేయించడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటంతోపాటు ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యమన్నారు.కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల అదిమల్లయ్య, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జిట్ట బొందయ్య, ముబిన్, శ్రీనివాస్‌రెడ్డి, చిత్రగంటి నాగరాజు పాల్గొన్నారు.