నల్లగొండ, నవంబర్ 17: జిల్లాలో చలి వాతావరణం క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు కనిపించకపోయినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలో క్షీణ దశ కనిపిస్తుండడంతో చలి వణికిస్తున్నది. ప్రధానంగా రాత్రి పూట, తెల్లవారు జామున చలి తీవ్రత గణనీయంగా ఉంది.
శీతాకాలం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి ప్రభావం కనిపిస్తున్నది. సాధారణంగా శీతాకాలం అక్టోబర్లో ప్రారంభమై జనవరితో ముగుస్తున్నది. చలి ప్రభావం మాత్రం డిసెంబర్లో ప్రారంభమై జనవరిలో తీవ్రంగా కనిపిస్తున్నది. అయితే ఈ సారి కాస్త ముందుగానే చూపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పొరుగు రాష్ర్టాల్లో వర్షాల ప్రభావంతో అక్కడి నుంచి చలి గాలులు వీయడం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది. గడిచిన వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 నుంచి 19 డిగ్రీల మధ్యలో నమోదవుతుండగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల వరకు 14 నుంచి 16డిగ్రీల మధ్యలో నమోదు అవుతుండడంతో తెల్లవారు జామున దుప్పటి లేనిదే పడుకోలేని పరిస్థితి. అయితే నల్లగొండ, సూర్యాపేట కంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.
స్వెట్టర్లతోనే పిల్లల బడిబాట..
చలి ప్రభావం ఎక్కువవుతుండడంతో పిల్లలు స్వెట్టర్లు వేసుకోని బడి బాట పడుతుండగా వృద్ధులు అవి లేకుండా పొద్దున పూట బయట కూర్చోలేక పోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా జలుబు, జ్వరం ప్రభావం సైతం షురూ అయింది.