పంటలకు పోషకాలు ఎంతో అవసరం. వాటిల్లో అతి ముఖ్యమైనది భాస్వరం. ఈ పోషకాన్ని పంటలకు అందించేందుకు రైతులు పాస్ఫరస్ ఉన్న రసాయన ఎరువులను అధికంగా వాడుతుంటారు. అయితే.. అందులో కొంత భాగాన్ని మాత్రమే మొక్కలు గ్రహిస్తుండగా.. ఎక్కువ శాతం భూమిలోనే పేరుకు పోయి నిల్వ ఉంటుంది. దీన్ని కరిగించి మొక్కలకు అందించేందుకు పాస్ఫరస్ సాయిలబులైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ) ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. దీనివాడకంతో ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుందని సూచిస్తున్నారు.
భాస్కరం మొక్కల వేర్లు ధృడంగా వచ్చేందుకు, పంట చేలు ఏపుగా పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. మొక్కలకు ఈ పోషకాన్ని అందించేందుకు రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నారు. అయితే.. కాంప్లెక్స్ రూపంలో వేసే భాస్వరంలో కొంత భాగం మాత్రమే మొక్కలు గ్రహిస్తాయి. ఎక్కువ భాగం భూమిలోనే నిల్వ ఉండి పై పొరను గట్టిపరుస్తుంది. దాంతో రైతులు ఆశించిన స్థాయిలో పంట చేలు పెరుగవు. ఈ క్రమంలో మళ్లీ ఎరువులు వేస్తూ అధిక మోతాదులో వినియోగించి పెట్టుబడి ఖర్చు పెంచుకుంటున్నారు. భూమిలో భాస్వరం నిల్వలు పెరిగిపోవడంతో సేంద్రియ కర్బనం తగ్గిపోయి నేల సారవంతం కోల్పోతుంది. ఫలితంగా పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ, జీవ ఎరువులు వాడాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పీఎస్బీలో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు భూమిలో ఎన్నో ఏండ్ల నుంచి మొక్కలకు లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయని చెప్తున్నారు.
పాస్ఫరస్ సాయిలబులైజింగ్ బ్యాక్టీరియా మార్కెట్లో పౌడర్, ద్రవ రూపంలో లభిస్తుంది. వీటి ధర కూడా తక్కువే. ఎకరానికి సరిపోయే పీఎస్బీ రూ.400లోపే ఉంటుంది. ఎకరానికి 2 కిలోల పీఎస్బీ పౌడర్‌ను పేడ లేదా మట్టిలో కలిపి పొలంలో చల్లుకోవాలి. ద్రవ రూపంలో లభించే పీఎస్బీని ఎకరానికి లీటర్ చొప్పున పేడ లేదా మట్టిలో కలిపి చల్లుకోవాలి. పీఎస్బీని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. పొలంలో చల్లడం, విత్తనాలకు పీఎస్బీ పౌడర్‌ను నేరుగా పట్టించడం చేయవచ్చు. దాంతో పంటకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభించి మొక్క వేర్లు బలంగా రావడంతోపాటు చేను ఏపుగా పెరుగుతుంది. ఫలితంగా 10 నుంచి 15 శాతం వరకు అధిక దిగుబడి పొందవచ్చు. రసాయన ఎరువల వాడకం తగ్గడంతో పెట్టుబడి ఖర్చులూ ఆదా అవుతాయి.
పంటలకు భాస్వరాన్ని రైతులు డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తున్నారు. అందులోని ఎరువు మొత్తం మొక్కకు లభ్యం కాదు. ఎక్కువ భాగం భూమిలోనే నిల్వ ఉండిపోతుంది. భూమిలో నిరుపయోగంగా నిల్వ ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించడానికి పీఎస్బీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పీఎస్బీలో ఉండే బ్యాక్టీరియా భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. దాంతో పంటలు ఏపుగా పెరుగుతాయి. ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. రైతులు పీఎస్బీని వాడి పెట్టుబడిని తగ్గించుకోవాలి. దిగుబడిని పెంచుకోవాలి.
– లావణ్య, మండల
వ్యవసాయ అధికారి, గుండాల మండలం