నల్లగొండ, నవంబర్ 16 : శ్రీ వల్లి టౌన్షిప్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, పాక్షిక గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నది. అతి తక్కువ ధరలో వీటిని అందిస్తుండడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ నెల 14 నుంచి శ్రీవల్లి టౌన్షిప్లో ఉన్న ప్లాట్ల, పాక్షిక గృహ నిర్మాణాల వేలం జరుగుతున్నది. బుధవారం మూడో రోజు వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. మొదటి రెండు రోజుల్లో బిడ్డర్లు పెద్దగా హాజరు కాలేదు. కానీ మూడో రోజు మాత్రం పెద్ద ఎత్తున హాజరు కావటంతో 30 ఓపెన్ ప్లాట్లతో పాటు 41 పాక్షిక గృహాలు అమ్ముడు పోయాయి. దాంతో ప్రభుత్వానికి రూ.7.45 కోట్ల ఆదాయం వచ్చింది.
229 ప్లాట్లు.. 355పాక్షిక గృహాలు..
శ్రీవల్లి టౌన్ షిప్‌నకు సంబంధించిన వెంచర్లో 229 ఓపెన్ ప్లాట్లు, 355 పాక్షిక నిర్మాణ గృహాలు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్ల ఆప్సెట్ ధర రూ.6వేలుగా నిర్ణయించగా పాక్షిక నిర్మాణ గృహాల ఆప్సెట్ ధర రూ.10. 500 గా నిర్ణయిచారు. ఆసక్తి ఉన్న వారు గురువారం చివరిరోజు వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకోవచ్చు. వివరాలు కోసం 91543 39209 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ వెంచర్లో రోడ్లు, మౌలిక వసతులు వంటివి ప్రభుత్వమే కల్పించనున్నది.
ప్లాట్ల విక్రయానికి నేడు ఆఖరు..
జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం సమీపంలో అద్దంకి నార్కట్‌పల్లి రోడ్డుపై ఉన్న శ్రీవల్లి టౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణాల వేలం మూడు రోజులుగా కొనసాగుతుండగా గురువారం వేలం ఆఖరి రోజుగా అధికారులు నిర్ణయించారు. సోమవారం కలెక్టరేట్లో వేలం ప్రారంభం కాగా తొలి రోజు ప్రభుత్వానికి రూ.1.60 కోట్ల ఆదాయం రాగా రెండో రోజు రూ.55లక్షలు, మూడో రోజు 7.45 కోట్ల ఆదాయం సమకూరింది. చివరిరోజు వేలంలో పాల్గొనే వారు కలెక్టరేట్లో రూ.10 వేల డీడీ చెల్లించి వేలం దక్కించుకుకోవచ్చు.