దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సర్వే చేపడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 20 మండలాల్లో 82,915 ఎకరాల పోడు భూములుండగా 33,569 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దానికి అనుగుణంగా అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 20 లోగా సర్వే పూర్తిచేసి నివేదిక అందజేయాలని, అవసరమైతే సర్వే టీములను పెంచాలని శుక్రవారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామ, డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయాలని సూచించారు.
పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 11 : ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ఆవాసాలను విభజించి పంచాయతీ కార్యదర్శి, ఆర్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. వీరు ముందస్తుగా గ్రామ పంచాయతీల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి భూమి తాలుకా ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, ఓటర్‌కార్డు వంటి పత్రాలను సేకరించి వాటిని ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడం జరుగుతుంది. పత్రాలు సక్రమంగా ఉన్న రైతుల సమక్షంలో క్షేత్రస్థాయిలో భూమి వద్దకు వెళ్లి సదరు భూ వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసి చందంపేట, పీఏపల్లి మండలాల్లో దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు.
అటు అటవీ శాఖ భూములకు అటంకం కలుగకుండా అర్హత ఉండి ఏళ్ల తరబడి పోడు భూమి సాగు చేసుకుంటున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తున్నది. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతుల దరఖాస్తులే కాకుండా మైదాన ప్రాంతంలోని గిరిజనేతర రైతుల దరఖాస్తులను కూడా పరిశీలించనున్నారు. గిరిజన రైతులు అయితే 2005 డిసెంబర్ 13 నుంచి భూమి సేద్యం చేసుకోవాల్సి ఉండగా గిరిజనేతర (ఇతర రైతులు) 2005 ముందు 75 సంవత్సరాల క్రితం నుంచి భూమిని సాగు చేసుకుంటున్నట్లు ధ్రువీకరించాల్సి ఉన్నది. మండలాల తాసీల్దార్లు నిత్యం దరఖాస్తుల పరిశీలన, క్షేత్ర పర్యటన, ఆన్లైన్ నమోదును పర్యవేక్షించనున్నారు.
ఈ నెల చివరిలోగా అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ చందంపేట మండలంలో పర్యటించగా, కలెక్టర్ పీఏ పల్లి మం డలంలో దరఖాస్తుల పరిశీలనతో పాటు నేరుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులతో మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలోని 13 మండలాల్లో దామరచర్ల, తిరుమలగిరి సాగర్, ఉమ్మడి చందంపేట, పీఏపల్లి మండలాల నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురంలో 2,130 మంది రైతులు 6,133 ఎకరాలకు దరఖాస్తులు చేసుకోగా సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ డివిజన్ పరిధిలో మట్టంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతలపాలెంతో కలిపి 7,373మంది రైతులు 20, 480 ఎకరాల పోడు భూములకు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,569 మంది రైతుల నుంచి 82 వేల ఎకరాలకు పైగా దరఖాస్తులు అందాయి.
భువనగిరికలెక్టరేట్, నవంబర్ 11 : ఈ నెల 19లోగా పోడు భూముల సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోడు భూముల సర్వేలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం సీఎస్ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పోడు భూముల సర్వే పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి కలెక్టర్ పమేలాసత్పతి మాట్లాడుతూ.. జిల్లాలో పోడుభూముల సర్వేను వివరించారు.
చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, తుర్కపల్లి మండలాలకు సంబంధించి 10 గ్రామాల్లో 2,130 ధరఖాస్తులకు గాను 187 ధరఖాస్తులు పరిశీలించినట్లు, 6,133 ఎకరాలకు గాను 132ఎకరాలు సర్వే చేయడం జరిగిందన్నారు. 20 టీమ్‌ల ద్వారా సర్వే నిర్వహించి గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి కమిటీ తీర్మానాలతో ఈ నెల 19లోగా సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, డీసీపీ కె.నారాయణరెడ్డి, డీఆర్డీఓ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు.
రా్రష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ మాసంలోనే పరిశీలన పూర్తి చేయాల్సి ఉండగా మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కొంత జాప్యం జరిగింది. ఈ నెల చివరిలోగా అర్హులైన రైతులను గుర్తిస్తాం. ప్రభుత్వ నింబంధనల ప్రకారమే రైతుల గుర్తింపు జరుగుతుంది. రైతులు కూడా పరిశీలన అధికారులకు సహకరించాలి. పారదర్శకంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది.
– రాజ్‌కుమార్, జిల్లా గిరిజన
సర్కార్ ఆదేశంతో పోడు భూముల సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం అడుగులు ముమ్మరంగా కదులుతున్నాయి. దీంతో తరాలుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల సమన్వయంతో అధికారులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 82 వేల ఎకరాల పోడు భూములకు గాను 33,569 మంది రైతుల నుంచి దరఖాస్తులు అందాయి. నల్లగొండ జిల్లాలో 24,066, యాదాద్రి భువనగిరిలో 2,130, సూర్యాపేటలో 7,373 మంది రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.