రామగిరి, ఫిబ్రవరి 10: మారుతున్న కాలానికి అనుగుణంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయుల సహాయంతో ప్రాజెక్టులు తయారు చేశారు. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనలో 38ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. జనవరి 11, 12లో ఆయా వివరాలతో ఆన్లైన్లో ప్రదర్శనలు నిర్వహించగా గురువారం వెల్లడించిన ఫలితాల్లో నాలుగు ప్రాజెక్టులు జాతీ స్థాయికి ఎంపికయ్యాయి.
ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన ప్రాజెక్టులు ఇవే…
నల్లగొండ జిల్లాలో…
అనుముల మండలం యాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి బొడ్డుపల్లి లోకేశ్ తయారు చేసిన ‘సైడ్ స్టాండ్ కంట్రోల్ వెహికిల్’ ప్రాజెక్టు
నల్లగొండలో సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఎం.స్ఫూర్తి నివేదిత రూపొందించిన ‘ఇటుకలు తరలించే యంత్రం’.
సూరాపేట జిల్లాలో…
మునగాల జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి తన్నీరు అఖిల్ తయారు చేసిన ‘కొబ్బరి బొండాం నుంచి నీళ్లు తీసే యంత్రం’
యాదాద్రి భువనగిరి జిల్లాలో…
ఆలేరు మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని అన్నెబోయిన భవాని తయారు చేసిన ‘తృణధాన్యాల నూర్పిడి యంత్రం’
ప్రాజెక్టు పేరు : కొబ్బరి నీళ్లు తీసే యంత్రం
విద్యార్థి పేరు : టి.అఖిల్ , గైడ్ టీచర్ : షేక్ జాఫర్
స్కూల్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునగాల, సూర్యాపేట జిల్లా
పనిచేసే విధానం : ఇనుప పైపులతో స్టాండ్ తయారు చేయాలి. దానికి ఒక పైప్ సహాయంతో బొండాలను కట్ చేసేలా పదునైన కత్తిని బిగించాలి. దాంతో పెద్దగా శ్రమ అవసరం లేకుండా సులభంగా బొండాన్ని కట్ చేయవచ్చు. మహిళలు సైతం తేలికగా ఉపయోగించవచ్చు. సాధారణ కత్తి ద్వారా వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యంత్రం ద్వారా ప్రమాదాలకు అవకాశం లేదు. రూ.2వేలు ఖర్చవుతుంది.
ప్రాజెక్టు పేరు : సైడ్ స్టాండ్ కంట్రోల్ వెహికిల్
విద్యార్థి : బొడ్డుపల్లి లోకేశ్, 8వతరగతి
గైడ్ టీచర్ : నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్
స్కూల్ : జడ్పీహెచ్ఎస్, యాచారం, అనుముల
ప్రాజెక్టు ఉద్దేశం : సైడ్ స్టాండ్ తీయకుండా ద్వి చక్రవాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను అరికట్టడం
పరికరాలు : అయస్కాంతం, సెన్సార్, విద్యుత్ వాహక తీగలు, బైక్
పనిచేసే విధానం : బైక్ స్టాండ్ దగ్గర మ్యాగ్నటిక్ సెన్సార్ అమర్చుతారు. స్టాండ్ తీస్తేనే బైక్ స్టార్ట్ అవుతుంది. లేదంటే సెన్సార్ అడ్డుకుంటుంది. వాహనం నడిపే వ్యక్తి సైడ్ స్టాండ్ తీసీ స్టార్ట్ చేసేలా అప్రమత్తం చేస్తుంది.
ప్రాజెక్టు పేరు : పంట నూర్పిడి యంత్రం
విద్యార్థిని పేరు : అన్నెబోయిన భవాని, 10వతరగతి
గైడ్ టీచర్ : నవీన్ కుమార్
స్కూల్ : టీఎస్ మోడల్ స్కూల్, బొమ్మల రామారం, యాదాద్రి భువనగిరి జిల్లా
పనిచేసే విధానం : తృణధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి వద్దనే వాటిని నూర్పిడి చేసేలా యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రాన్ని ఎక్కడికైనా తీసుకు వెళ్లేలా ఉంటుంది. ఆటో, ట్రాక్టర్ ట్రాలీ సాయంతో ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి తరలించడానికి వీలుగా ఉంటుంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి కూడా ఉపయోగ పడుతుంది.
జాతీయ స్థాయికి ఎంపికవ్వడం హర్షణీయం
ఇన్స్పైర్ మానక్ 2020-21 రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో జిల్లా నుంచి 20 ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిలో 2 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ రెండు ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
ప్రాజెక్టు పేరు : ఇటుకలు తరలించే యంత్రం
విద్యార్థిని : ఎం.స్ఫూర్తి నివేదిత, 9వ తరగతి
గైడ్ టీచర్ : వినోద్
స్కూల్ : సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్, నల్లగొండ
ప్రాజెక్టు ఉద్దేశం : భవన నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలను పై అంతస్తులకు తరలించడం, నిర్మాణ సామగ్రిని చేరవేయడంలో కూలీల శ్రమను తగ్గించడం
పనిచేసే విధానం : కర్రతో తయారు చేసిన ఫ్రేమ్‌కు సైకిల్‌కి ఉపయోగించే చైన్, చక్రం సహాయంతో దీన్ని రూపొందించారు. ఫ్రేమ్ చుట్టిన మందపాటి వస్త్రంపై ఉన్న డబ్బాలో ఇటుకలు ఉంచి చక్రం తిప్పితే ఇటుకలు పైకి చేరుకుంటాయి.
జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటాలి
సృజనాత్మకతను వెలికి తీసేలా నిర్వహిస్తున్న ఇన్స్ఫైర్ మానక్ ప్రాజెక్టుల ప్రదర్శన బాలశాస్త్రవేత్తలకు ఉత్తమ వేదిక. జిల్లా వ్యాప్తంగా 196 ప్రాజెక్టులు నమోదు కాగా 20 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. తిరిగి రెండు ప్రాజెక్టులు మన జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. ప్రాజెక్టుల నమోదు నుంచి తయారీ వరకు సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించారు. మార్చిలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనలో జిల్లా ఖ్యాతిని చాటాలని ఆకాంక్షిస్తున్నా.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ