రామగిరి, నవంబర్ 9 : నల్లగొండ గడియారం సెంటర్ సమీపంలోని లతీఫ్సాబ్ గుట్టపై గల లతీఫ్ ఉల్లాషాఖాద్రి దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభంకానున్నాయి. అధికారికంగా మూడ్రోజులు వేడుక జరుగుతుంది. అనంతరం మరో 30రోజుల పాటు వైభవంగా జరిగే ఉత్సవాలకు జిల్లాతో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్ర నలుమూలల నుంచి హిందూ ముస్లింలు హాజరవుతారు. ఇందుకు ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దర్గాను ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు.
తొలిరోజు గడియారం సెంటర్ సమీపంలోని మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థన చేసి సాయంత్రం 5.30గంటలకు గంధం ఊరేగింపు ప్రారంభిస్తారు. ఈ ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా సాగి రాత్రి 9:30గంటలకు దర్గా మెట్ల వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ముస్లిం పెద్దలు, దర్గా ఇనాందారులు గంధాన్ని గుట్టపైకి తీసుకెళ్తారు. ఉర్సు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని ఇప్పటికే నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తి చేశారు. తొలి రోజు గంధం ఊరేగింపునకు కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ నెల 11న గుట్ట మెట్ల వద్ద దీపాలంకరణోత్సవంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదేరోజు రాత్రి ముస్లిం మత గురువులు ఖురాన్ సందేశాన్ని వినిపిస్తారు. 12న ఖవ్వాలీ కార్యక్రమం ఔరంగబాద్ వారిచే జరుగుతుంది.