యాదాద్రి, నవంబర్ 7 : కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివుడికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో 584మంది దంపతులు పాల్గొన్నారు. రామలింగేశ్వర ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు.
సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పుకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు నిర్వహించిన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించారు.
అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామూన సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో కార్తిక మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. సుమారు 20వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.27,00,489 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రిశుడి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి ప్రవాస భారతీయుడు పైళ్ల శేఖర్‌రెడ్డి, సంగీత దంపతులు రూ.50,005 విరాళం అందించారు. సోమవారం స్వామివారిని దర్శించుకున్న వారు ఇందుకు సంబంధించిన నగదును ఆలయ ఏఈఓ రఘుబాబుకు అందించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి ఆహార భద్రతా అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లభించింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం, తీర్థంతోపాటు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి వసతి, స్వామివారి లడ్డూ ప్రసాదం, పులిహోర, బూరెల తయారీలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 కింద లైసెన్స్ మంజూరు చేసిందని ఆలయ ఈఓ గీత తెలిపారు. స్వామివారి ఆలయంలో భక్తులకు అందజేసే ప్రసాదాలు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఐఏ గుర్తించిందని ఆమె చెప్పారు. ఆహార భద్రతా ఆథారిటీకి లోబడి ప్రసాదాలు తయారు చేస్తుండడాన్ని గుర్తించి అధికారికంగా అనుమతి మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధ ఉపాలయాలను మంగళవారం మూసివేయనున్నారు. కార్తిక పౌర్ణమి రోజున వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.37గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగియనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి 8.15గంటలకు నిత్య కైంకర్యాలను చేపట్టి నివేదనతో ముగించి ద్వారబంధనం చేపట్టి ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. తిరిగి రాత్రికి 8గంటలకు తెరిచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం చేసి 10గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాల్లో భక్తులచే నిర్వహించే నిత్య, శాశ్వత తిరుకల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సం, ఊరేగింపు సేవ, సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు రద్దు చేయనున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9న యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు.
తడి బట్టలతో దొంగ ప్రమాణం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సహించలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫైర్ అయ్యారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని హేళన చేసిన బండి సంజయ్‌కి మునుగోడు ఉప ఎన్నికల రూపంలో తగిన గుణపాఠం అయ్యిందన్నారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. మునుగోడు ఫలితాల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. టీఆర్ఎస్ వెంట నడిచిన మునుగోడు ప్రజలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నీచ రాజకీయాలు చేసే బీజేపీ మూర్ఖులకు జ్ఞానోదయం కల్పించు స్వామీ.. అంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బుద్ధిని కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని స్వామివారికి పూజలు చేశారు. కార్తిక సోమవారం సందర్భంగా మంత్రి స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ మాఢ వీధుల్లో దివ్యాంగురాలితో మాట్లాడుతూ మనోధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసేలా చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. స్వయంభూ క్షేత్రంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేయించినట్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో అధర్మంపై ధర్మం గెలిచిందన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పారు. యాదాద్రి ఆలయం అద్భుత కళాఖండమని, నిత్యం భక్తుల సందడితో వర్ధిల్లుతుందన్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,65,350
వీఐపీ దర్శనాలు 75,000
బ్రేక్ దర్శనాలు 66,000
వేద ఆశీర్వచనం 15,000
సుప్రభాతం 2,200
ప్రచార శాఖ 23,000
వ్రత పూజలు 4,67,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 85,500
ప్రసాద విక్రయం 10,55,070
వాహనపూజలు 18,900
శాశ్వత పూజలు 85,000
అన్నదాన విరాళం 37,025
సువర్ణ పుష్పార్చన 1,34,600
యాదరుషి నిలయం 68,924
పాతగుట్ట నుంచి 96,120
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 17,100