సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 7: ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉన్నది. వీటిలో ఒకటి మహిమానిత్వమైన స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది సంస్థాన్ నారాయణపురం మం డలం చిల్లాపురంలో ఉన్నది. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున స్వయంభు రామలింగేశ్వర స్వామి జాతర కన్నుల పండువగా జరుగుతుంది. మంగళవారం జరిగే జాతరకు నిర్వాహ కులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
భక్తుల కొంగు బంగారం.. చిల్లాపురం గ్రామంలో ఎత్తయిన గుట్ట పైన వెలిసిన స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఘన చరిత్ర ఉన్నది. సుమారు 900 ఏండ్ల క్రితం స్వయంభు రామలింగేశ్వర స్వామి వెలిసినట్లు చరిత్ర చెబుతున్నది. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఇక్కడి రామలింగేశ్వరుడి దేవాలయ ద్వారాలు తెరిచి పూజలు నిర్వహించడం ప్రత్యేకత. ఇక్కడ మొక్కుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. గుట్ట పైన ఉన్న గుండంలో నీరు ఏడాదంంతా ఉంటుంది.
ఈ గుండంలో స్నానమాచరిస్తే అంటూవ్యాధులు, పాపాలు తొలిగిపోతాయని భక్తులు విశ్వాసం. అంతేకాకుండా కోనేటిలో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల మండలాలతో పాటు ఉమ్మడి నల్లగొండ,హైదారబాద్తోపాలు ఇతర జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు జాతరకు వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులు హాజరు కానుందున ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాతల సహకారంతో ఆర్చీలతోపాటు ప్రభుత్వ నిధులు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. తాగునీటీ సౌకర్యం కల్పించారు.