నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కా వ్యూహా రచనతో పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. తొలి నుంచి కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా అనుకున్న విధంగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగారు. దాంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలోనూ మంచి మెజార్టీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. బీజేపీ ఢిల్లీ పెద్దల కనుసన్నుల్లో మునుగోడులో ఆ పార్టీ నేతలు ఎన్ని రకాల కుట్రలు, కుయుక్తులు, దాడులు, రెచ్చగొట్టే చేష్టలు సాగించినా వాటన్నింటినీ తిప్పికొడుతూ పైచేయి సాధించారు. తమకు ఏ మాత్రం సంబంధం లేని మునుగోడులో ఉప ఎన్నికకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ముందే గ్రహించింది.
ఆ మేరకు పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. తెలంగాణలో ఎలాగైనా టీఆర్ఎస్ సర్కార్‌ను అస్థిర పర్చాలన్న కుట్రతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చాటాలని, అందుకు మునుగోడు ఉప ఎన్నికను అస్త్రంగా మల్చుకోవాలని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు భావించారు. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ అప్రజాస్వామిక చర్యలను గమనిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఆది నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ వచ్చారు. మోదీ సర్కార్ విధానాలతో పాటు బీజేపీ మతోన్మాద చర్యలపై అప్పటికే దేశవ్యాప్త సమరశంఖానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ఈ ఉప ఎన్నికను మంచి అవకాశంగా తీసుకున్నారు.
అందులోభాగంగానే బీజేపీపై పోరాటంలో నికరంగా వ్యవహరిస్తున్న సీపీఐ, సీపీఎంలను కలుపుకుపోవాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా బీజేపీపై దేశవ్యాప్త పోరాటంలో కలిసివస్తామన్న కమ్యూనిస్టు పార్టీలను మునుగోడు ఉప ఎన్నిక వేదికగానే ఆహ్వానించారు. దాంతో మునుగోడులో టీఆర్ఎస్తో కలిసి బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు సైతం ప్రకటించడంతో ఉప పోరులో తొలి అడుగు పడింది. ఇక ఆ పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహారచన చేసింది. మునుగోడుపై పోరులో పై నుంచి క్షేత్రస్థాయి వరకు మిత్రపక్షాలు సమన్వయంతో ముందుకు సాగాయి.
ఈ క్రమంలో సెప్టెంబర్ 20న మునుగోడులో నిర్వహించిన బహిరంగసభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ వినాశనకర విధానాలను, తెలంగాణపై కుట్రలను విడమరిచి చెబుతూ ఉప పోరు ప్రాధాన్యతను వివరించారు. బీజేపీకి ఇక్కడ స్థానం లేదని మునుగోడు నుంచే చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక చివరలో చండూరులో నిర్వహించిన సభలో మునుగోడు అభివృద్ధ్ది అవశ్యకత, బీజేపీ కుయుక్తులను గురించి ప్రజలను ఆకట్టుకున్నారు. బీజేపీపై దేశవ్యాప్త పోరుకు మునుగోడు నుంచి బీజం పడాలని, ఇక్కడి గెలుపుతో బీఆర్ఎస్కు బలమైన నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో మంత్రి హరీశ్‌రావు కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఇన్చార్జిలకు గైడ్ చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను నడపించారు. ఇక మండల కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
జిల్లా స్థాయిలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఉపఎన్నికలో అన్నీ తానై సారధ్యం వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో సీపీఐ, సీపీఎం శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థ్ది కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోజూ వారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు పార్టీలో చేరికలు, సమన్వయంపై దృష్టి సారించారు. తొలిరోజు అభ్యర్థి ప్రచారంలోనే కొరటికల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చిన రూ.18వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుకు కేటాయిస్తే బరిలో నుంచి తప్పుకుంటామంటూ చేసిన సవాల్ హైలెట్‌గా నిలిచింది.
దీనికి బీజేపీ నేతల నుంచి సమాధానం లేకపోగా వారి చేసే ప్రతి విమర్శకు మంత్రి జగదీశ్‌రెడ్డి దీటుగా స్పందిస్తూ వచ్చారు. మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమంటూ చేసిన పనులు వివరిస్తూ చేయాల్సిన వాటిపై తమ నిబద్ధతను వివరించడంలో సక్సెస్ అయ్యారు. ఇక గతంలోనూ హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో జగదీశ్‌రెడ్డి తనదైన వ్యూహం అనుసరించారు. ఇదే తరహాలో మునుగోడు ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వరుసగా మూడో విజయాన్ని టీఆర్ఎస్ ఖాతాలో వేశారు.
మంత్రి జగదీశ్‌రెడ్డికి తోడుగా పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కూడా తనదైన పాత్ర పోషించారు. ఇక జిల్లా ఎంపీలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఎంపీటీసీల వారీగా, మున్సిపల్‌వార్డుల వారీగా ఇన్చార్జిలుగా వ్యవహరించిన పార్టీ నేతలంతా బీజేపీ ఓటమే లక్ష్యంగా పట్టుదలతో పనిచేశారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పార్టీ శ్రేణులను నడిపించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల తప్పుడు వాగ్దానాలను, మభ్య పెట్టే మాటలను, మోసపూరిత చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగారు.
కొన్నిచోట్ల దాడులు, దౌర్జన్యాలకు బీజేపీ కుట్రలు చేసి ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా పార్టీ పరంగా పూర్తి సంయమనంతో వ్యవహరించి పై చేయి సాధించారు. మొత్తం పార్టీ నేతల సమష్టి కృషి, పట్టుదలతో ఉమ్మడి జిల్లాలోని రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్నింటికి అన్నీ అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినైట్లెంది. ఉమ్మడి జిల్లా ఎన్నికల రాజకీయంలో ఇదే అరుదైన సందర్భంగా చరిత్రలో నిలిచిపోనుంది.