నందికొండ, నవంబర్ 5 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం తగ్గింది. దాంతో ప్రాజెక్టు అధికారులు డ్యాం క్రస్ట్‌గేట్లను మూసివేసి, నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ( 311.4474 టీఎంసీ) ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 59,127 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా రిజర్వాయర్ నుంచి కుడికాల్వకు 6,112 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7,518, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 34,185, వరద కాల్వకు 400, ఎస్ఎల్బీసీకి 1200 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.