ఎన్నో ఆశలు.. విభిన్న ఆలోచనలు ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారంతా.. టీఎస్‌ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించారు. బీటెక్ చదివేందుకు ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం అడుగుపెట్టారు. నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను గుర్తు చేసుకుంటూ కొద్దిపాటి భయం, రెట్టించిన ఉత్సాహంతో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందారు. వారికి ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో యూనివర్సిటీ అవగాహన సదస్సు నిర్వహించింది. అధ్యాపకులు చెప్పిన విషయాలు స్ఫూర్తినిచ్చేలా, భరోసా నింపేలా ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండుల్రు పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం ఓరియేంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సు ద్వారా ఉపాధ్యాయులు వర్సిటీ ప్రత్యేకత, బీటెక్ స్ట్రక్టర్, బ్రాంచ్‌ల ప్రాముఖ్యత, కాలేజీ కల్పించే వసతులు, సదుపాయాలను వివరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు. దాంతో కొత్త ప్రపంచంలోకి అడుగిడిన విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో విజయవంతంగా కోర్సును పూర్తిచేసి అనుకున్న లక్ష్యాలను అందుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇతర యూనివర్సిటీలకు ధీటుగా ఎంజీయూ
ఇతర యూనివర్సిటీలకు ధీటుగా నడక, నడత, నడవడికతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించమే లక్ష్యంగా ఎంజీయూ ముందుకు సాగుతున్నదని వర్సిటీ ఓఎస్డీ డాక్టర్ అల్వాల రవి తెలిపారు. వర్సిటీ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు కూడా నిరంతరం సాధన చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని చెప్పారు. కావాల్సిన వసతులతో పాటు ఆధునిక ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.అత్యంత నిపుణులైన అధ్యాపక బృందం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వారంతా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు సహాయ పడుతారని వెల్లడించారు. నాలుగేండ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే 40 ఏండ్లు సంతోషంగా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఎంజీయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఆకుల రవి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులు తొలి ఏడాది నుంచే ప్రత్యేక ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమన్నారు. సబ్జెక్టుల విషయంలో సందేహాలు వస్తే సంబంధిత నిపుణులైన అధ్యాపకుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ.. ఏఐఐసీటీఈ ఆదేశాల మేరకు తొలి సంవత్సరం విద్యార్థులకు బీటెక్ వివిధ కోర్సుల్లోని అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే అత్యంత అధునాతన టెక్నాలజీతో కొత్త భవనం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్ హరీశ్‌కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, ఎంజీయూ ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భిక్షమయ్య, ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ హెచ్ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫస్ట్ ఇయర్‌నే కీలకమని అర్థమైంది
ఎంజీయూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు రావడం సంతోషంగా ఉన్నది. తొలిరోజు ఓరియంటేషన్‌కు నాన్న సత్యనారాయణతో కలిసి వర్సిటీలో అడుగు పెట్టా. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ కెరీర్‌ను ఎంచుకునేందుకు ప్రథమ సంవత్సరమే కీలకమని ఓరియంటేషన్తో తెలిసింది. అధ్యాపకుల సూచనలు పాటిస్తూ చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తా.
– తండ్రి సత్యనారాయణతో శివాణి, సీఎస్ఈ విద్యార్ధిని, సూర్యాపేట
ఇలా చదివితే విజయం తథ్యం..
భవిష్యత్‌పై భరోసా కలిగింది
నాకు వచ్చిన ర్యాంకుకు హైదరాబాద్‌లోని ఓయూతో పాటు ఇతర టాప్ కళాశాలల్లో సీటు వచ్చేది. కానీ ప్రశాంతమైన వాతావరణం, ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న ఎంజీయూలో చదవాలనే మా నాన్న కోరిక మేరకు తొలి ఆప్షన్‌గా ఎంజీయూని ఎంపిక చేసుకున్నా. దీంతో ఇక్కడ సీటు రావడంతో నాన్నతో కలిసి ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యా. నాకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నా. అధ్యాపకులు, వసతులు, ల్యాబ్, గ్రంథాలయం వాటిని సద్వినియోగం చేసుకునే అంశాలపై వివరించారు. మంచిగా చదివి ఉద్యోగం సాధించి అమ్మనాన్న కోరిక తీర్చాలనేదే నా కోరిక.
– బండి రమేశ్, ఈసీఈ, హైదరాబాద్
విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలి
ప్రశాంత వాతావరణంలో ఉన్నత ప్రమాణాలతో యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో తరగతులు నిర్వహణ చాలా సంతోషం. అధికారులు యూనివర్సిటీలోని వసతులు, ఇతర అంశాలపై వివరించడంతో విద్యార్థులకు అందించే విద్యపై మరింత భరోసా కలిగింది. వారి ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగపడేలా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి. అన్ని కోర్సుల కంటే ఇంజినీరింగ్ విద్య భిన్నమైంది. ఆ స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఉత్తమ కంపెనీలలో ప్లేస్మెంట్ కోసం ఉద్యోగ మేళాలు నిర్వహించాలి.
– ఇమ్మడి సైమన్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, విద్యార్థిని తండ్రి, నల్లగొండ
యూనివర్సిటీలో సీటు రావడం సంతోషంగా ఉంది
కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశా. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఎంజీయూను ఎంపిక చేసుకున్నా. యూనివర్సిటీలో సీటు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఓరియంటేషన్ తరగతులకు హాజరుకావడంతో మనోధైర్యం పెరిగింది. బీటెక్ విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.
– బి. నవ్య, ఈఈఈ, కొత్తగూడెం, కోదాడ