రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాల పక్కన గల స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 93.13శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 ఓట్లకు గాను 2,25,192 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థులుగా పోటీ పడ్డారు. వీరితోపాటు బీఎస్పీ అభ్యర్థితోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాకముందు నుంచే నియోజకవర్గంలో టీఆర్ఎస్ పకడ్బందీగా ప్రచారం మొదలుపెట్టింది. దాంతో ఎక్కడ కూడా తగ్గకుండా చివరి వరకూ ప్రచార వ్యూహం కొనసాగింది. పోలింగ్ నాటికి మంచి సానుకూల ప్రభావంతో టీఆర్ఎస్దే విజయమని ఇప్పటికే స్పష్టమైంది. అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌లోనూ టీఆర్ఎస్సే గెలుస్తుందనే ప్రకటనలు వచ్చాయి. మంచి మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న చర్చ సర్వత్రా జరిగింది.
తొలి ఫలితం 9 గంటల్లోపే..
ఓట్ల లెక్కింపును ఒకే హాల్లో 21 టేబుళ్లపై లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7.30 గంటలకు ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరుస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాల్లోకి తీసుకొస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు టేబుళ్లపై ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు చేయాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతోపాటు ఆ వెంటే ఐదు, పది నిమిషాల తేడాతో తొలిరౌండ్ ఈవీఎంల లెక్కింపును కూడా ప్రారంభిస్తారు.
దాంతో తొలి ఫలితం ఉదయం 8.45 నుంచి 9 గంటల మధ్య రావచ్చని అంచనా. ఆ తర్వాత ప్రతి 20 నుంచి 30 నిమిషాల్లో ఒక రౌండ్ లెక్కింపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అయితే కంట్రోల్ యూనిట్లో బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు అనేది నిమిషాల్లో స్పష్టమైనా అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను నోట్ చేయడానికి కొంత సమయం పట్టనున్నది. మొత్తం 47 మంది అభ్యర్థుల ఓట్లతోపాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫలితం స్పష్టమైన తర్వాత ఆర్ఓ సంతకంతోపాటు ఎన్నికల పరిశీలకుడి ఆమోదం కూడా లభిస్తేనే అది అధికారికంగా బయటకు వెల్లడిస్తారు.
ఇదంతా జరుగాలంటే కనీసం 30 నిమిషాలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక చివరలో వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం ఈవీఎంలలో డ్రా ద్వారా ఎంపిక చేసిన ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తారు. సంబంధిత ఈవీఎంలలో వచ్చిన ఓట్ల లెక్కింపుతో సమానంగా ఉన్నాయా? లేదా అని చూస్తారు. ఇదంతా పూర్తయ్యాకే అధికారికంగా విజేతను ప్రకటించనున్నారు.
చౌటుప్పల్ నుంచి మొదలు…
ఓట్ల లెక్కింపు చౌటుప్పల్ మండలం నుంచి మొదలుకానున్నది. ఇక్కడ జైకాసారంలోని 1వ నంబర్ పోలింగ్ కేంద్రం నుంచి మొదలుకొని 68వ నంబర్ తూప్రాన్‌పేట పోలింగ్ కేంద్రం వరకు ఉన్నాయి. తర్వాత 69వ పోలింగ్ కేంద్రం నుంచి 122 వరకు సంస్థాన్ నారాయణపురం మండలం, 123 నుంచి 168 వరకు మునుగోడు మండలం, 169 నుంచి 217 వరకు చండూరు మండలం, 218 నుంచి 255 వరకు మర్రిగూడెం మండలం, 256 నుంచి చివరి పోలింగ్ కేంద్రం 298 వరకు నాంపల్లి మండలాలకు సంబంధించిన ఫలితాలు వరుస క్రమంలో వెలువడనున్నాయి.
చౌటుప్పల్ మండలం ఫలితాలు తొలి మూడు పూర్తి రౌండ్లతోపాటు నాలుగో రౌండ్లో ఐదు టేబుళ్లపై జరుగనున్నది. సంస్థాన్‌నారాయణపురం ఫలితం నాలుగో రౌండ్‌లోని ఆరవ టేబుల్ నుంచి మొదలై ఐదో రౌండ్ పూర్తిగా ఆరో రౌండ్‌లోని 17 టేబుళ్లపై కొనసాగనున్నది. తర్వాత మునుగోడు మండలానికి సంబంధించి ఆరో రౌండ్‌లోని 18వ టేబుల్ నుంచి కౌంటింగ్ మొదలై ఏడు, ఎనిమిది రౌండ్లు పూర్తిగా జరుగనున్నది. తర్వాత చండూరు మండలం కౌంటింగ్ తొమ్మిది రౌండ్‌లోని తొలి టేబుల్ నుంచి మొదలై పదో రౌండ్ పూర్తిగా, 11వ రౌండ్‌లోని ఏడో టేబుల్ వరకు జరుగనున్నది. మర్రిగూడ మండలం కౌంటింగ్ 11వ రౌండ్‌లోని 8వ టేబుల్ నుంచి మొదలై 12వ రౌండ్ పూర్తిగా, 13వ రౌండ్‌లోని 3వ టేబుల్ వరకు కొనసాగనున్నది. తర్వాత నాంపల్లి మండలానికి సంబంధించి 13వ రౌండ్‌లోని 4వ టేబుల్ నుంచి మొదలై 14వ రౌండ్ పూర్తిగా, 15వ రౌండ్‌లోని 4వ టేబుల్ వరకు జరుగనున్నది. దాంతో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నది.
పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల వరకే సిబ్బంది, ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌కు చేరుకునేలా ఆదేశాలిచ్చామని చెప్పారు. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు మొదలవుతుందని, ఆ వెంటనే ఈవీఎంల కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. చివరలో ఐదు ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
700 మందికి పైగా సిబ్బంది
ఓట్ల లెక్కింపు కోసం 250 మంది కౌంటింగ్ సిబ్బందితోపాటు మరో 470 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరే కాకుండా కౌంటింగ్ కేంద్రం వెలుపల అదనంగా పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. వీరిలో 100 మంది కేవలం కౌంటింగ్ కోసమే కాగా మిగతా 150 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. ఇక ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్‌తోపాటు ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరందరికీ మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. చివరగా శనివారం ఉదయం మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, ఆర్ఓ రోహిత్‌సింగ్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. పూర్తి సజావుగా కౌంటింగ్ కొనసాగించడమే లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పటిష్ట బందోబస్తు
కౌంటింగ్ సందర్భంగా గోదాము పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభంలోనే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ప్రధాన రహదారిపైనే పాసులు ఉంటేనే అనుమతించేలా చర్యలు చేపట్టారు. తర్వాత మరో రెండు దశల్లో చెక్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తారు. మొత్తం 470 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. శనివారం సిబ్బందికి బందోబస్తు డ్యూటీలు ఖరారు చేస్తూ పలు సూచనలు చేశారు. ఇక అభ్యర్థులు, వారి కౌటింగ్ ఏజెంట్ల వాహనాల కోసం హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మి గార్డెన్స్ ఆవరణలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. వారు అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రానికి వచ్చేందుకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ధ్రువీకరణ పత్రం అందుకోవడానికి కూడా అభ్యర్థితోపాటు పరిమిత సంఖ్యలోనే లోపలికి అనుమతిస్తామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు ఆయా రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.