పాలకవీడు, నవంబర్ 3 : ఆయకట్టు కింద రైతులు వానాకాలంలో సాగు చేసిన సన్న రకాల వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సన్నాలకు మంచి మద్దతు లభిస్తున్నది. రకాలను బట్టి క్వింటా 2100 నుంచి 2400 వరకు ధర లభిస్తున్నది. ప్రస్తుతం ధాన్యం ధర బాగా ఉందని మిల్లర్లు ఇదే ధరను కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం, పాలకవీడు, సజ్జాపురం, నాగిరెడ్డిగూడెం, బొత్తలపాలెం, ఎల్లాపురం, కోమటికుంట గ్రామాల రైతులు వానకాలంలో అధికంగా వరి సాగు చేశారు. ఆయా గ్రామాల రైతులు సన్నాలైన పూజలు, చింట్లు, హెచ్ఎంటీ రకాలు సాగు చేశారు. సాగర్ నీరు త్వరగా రావడం, అందరూ ఒకేసారి నాట్లు వేయడంతో ప్రస్తుతం అన్నీ ఒకేసారి కోతకు వచ్చాయి. ఈ ఏడాది చాలామంది రైతులు వెదజల్లడం, డ్రమ్సీడర్, కూలీలతో నాట్లు వేయించారు. వీటిలో పూజలు, హెచ్ఎంటీలను ముమ్మరంగా కోస్తున్నారు. హెచ్ఎంటీ, పూజల రకానికి చెందిన ధాన్యానికి క్వింటాకు 2,100నుంచి రూ.2250, చింట్లు రకానికి చెందిన ధాన్యానికి క్వింటాకు 2,200నుచి రూ.2,400 వరకు ధర పలుకుతున్నది. ముందుగా వస్తున్న ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ధాన్యం ధర ఆశాజనకంగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించకపోతే రైతులు మంచి లాభం పొందే అవకాశముంది.
ప్రస్తుతం ధాన్యానికి మంచి ధర
వానకాలం సాగులో ముందు నాట్లు పెట్టిన పొలాల వరి కోతలు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ప్రస్తుతం ధాన్యానికి మంచి రేటు ఉంది. ఇదే పద్ధతిలో చివరి దాకా రేటు కొనసాగితే రైతులకు వాన కాలం సాగు లాభదాయకంగా ఉంటుంది.
– యరెడ్ల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, పాలకవీడు