రామగిరి, నవంబర్ 2: కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో పాఠశాలల నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు లోపించినట్లు సర్వేల్లో తేలింది. దాంతో విద్యాశాఖ ఆన్లైన్లో ప్రత్యేక యాప్స్ ద్వారా పాఠ్యంశాలను బోధించినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తరగతులు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. దాంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం ‘ఇంటింటా చదువుల పంట’ పేరిట ఈ వినూత్న కార్యక్రమన్ని విద్యాశాఖ అమల్లో తెచ్చింది.
ఈ విద్యాసంవత్సరం నుంచే..
‘ఇంటింటా చదువుల పంట’ (ఐసీపీ) కార్యక్రమాన్ని సాంకేతిక మార్పులతో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ శనివారం విద్యార్థులకు తరగతి, సబ్జెక్టు వారీగా పాఠాల వర్క్షీట్లు అందిస్తారు. వీటిని విద్యార్థులు వారి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తదుపరి శుక్రవారంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతీ వారానికి సంబంధించిన విద్యార్థి ప్రోగ్రెస్ (కుములేటివ్)ను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు.
తరగతుల వారీగా ఇలా..
పాఠశాలల వివరాలను తరగతుల వారీగా సేకరించి వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయుల వాటప్స్ గ్రూపుల్లో నమోదు చేస్తారు. ప్రతీ శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్‌ను ఆయా గ్రూపుల్లో పోస్టుచేస్తారు. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, సామాన్య, సాంఘిక శాస్ర్తాల నుంచి ఎనిమిది నుంచి పది ప్రశ్నలుంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియంతోపాటు ఈ పర్యాయం ఉర్దూలో కూడా వీటిని అందిస్తుండడం విశేషం. విద్యార్థులు యాప్ లింక్‌ను తెరిచి జిల్లా, పాఠశాల పేరు గుర్తించి ఎంట్రీ బట్టన్ నోక్కాలి.
పేరు, తరగతి, సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాక ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఒత్తిడి లేకుండా ఇంటి వద్ద ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు ఈ వర్క్షీట్లు ఉపయోగపడుతాయి. వారంలో జరిగిన అంశాలపై సులభంగా సాధన చేసేందుకు వీలుంటుంది. దీంతో విద్యార్థి పురోగతి, పనితీరు, సందేహాలు, అపోహలను స్వయంగా మూల్యాంకనం చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా విద్యార్థుల్లో లోపించిన సామర్థ్యాలను ఉపాధ్యాయలు ఎప్పటికప్పుడు పరిశీలించి సామర్థ్యాలు పెంచే అవకాశం ఉంటుంది.
ప్రాక్టీస్ చేసేది ఇలా..
4 మొబైల్ ఫోన్లో https://cgweb.page.link/vD3U8e3nr9Vt1U4v5 అనే లింక్ ద్వారా SwiftChat డౌన్లోడ్ చేసుకోవాలి.
4 ఓటీపీని ఉపయోగించి ఫోన్ నంబర్ నిర్ధారించుకోవాలి.
4 తరువాత https://web.convegenius.ai/?botId =TS లింక్‌పై క్లిక్ చేయాలి. చాట్‌ని ప్రారంభించానికి Hi లేదా Hello అని పంపాలి.
4 నేర్చుకునే మాధ్యమాన్ని ఎంచుకోవాలి (తెలుగు/ ఇంగ్లిష్)
4 విద్యార్థి పేరు నమోదు చేసి వివరాలను నిర్ధారించుకోవాలి.
4 మొదటి ప్రాక్టిస్ శనివారం నుంచి తదుపరి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థి ప్రాక్టీస్‌కు అనుగుణంగా పంపిన వీడియో కంటెంట్‌ను చూసి నేర్చుకోవచ్చు.
4 వారానికి 30 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి.
సామర్థ్యాల పెంపునకు దోహదం
విద్యలో వెనుకబడిన విద్యార్థుల్లో తిరిగి పఠన, భాషా సామర్థ్యాలను పెంచేందుకు ఐపీపీ ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు లోపించినట్లు గుర్తించాం. వాటిని మెరుగు పర్చేందుకు ఇప్పటికే ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాం. దానికితోడు ఇప్పుడు ‘ఇంటింటా చదువుల పంట’ పేరుతో వర్క్షిట్ల ద్వారా సాధన చేయిస్తాం.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ