నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఐదారు ఏండ్ల నుంచి యాసంగికి వరి పెడుతున్నం. చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు చేసినంక నీళ్లుండబట్టె. అన్ని ఊళ్లల్ల ఇప్పుడు ఎవుసం బాగనే ఉన్నది. ఇప్పుడు వానకాలం పత్తి, ఎండాకాలం వరి పండిస్తున్నం. ఒకప్పుడు ఈడ వానకాలం వరి పండించడానికే నీళ్లకు ఇబ్బందయితుండె. ఇప్పుడు కాలం గాబట్టి యాసంగి వరి పండిస్తున్నం. మా జాతకం బాగుండి ఇట్ల కాలమైంది. అంతకుముందు వానకాలం.. ఆముదాలు, సజ్జలు, పొద్దుతిరుగుడు పండించినం. తిండి మందం వరి పెట్టుకునేది. చుట్టుపక్కల ఊళ్లల్ల రైతులంతా ఇట్లనే ఎవుసం జేసేది.
కలిసొచ్చిన కాలంలో..
మాకు తిండి మందం వడ్ల కోసం అర ఎకరం వరి పెట్టినం. ఎకరంన్నర మునగతోట పెట్టినం. ఇప్పుడు తోట పెడితే ఎండాకాలంలో ఎండిపోతదనే భయం లేదు. ఇందులో అంతరపంటగా బీరకాయలు, దోసకాయలు పెడతం. పైసలు ఎక్కువొస్తయ్. బయట కూలికిపోకుండా బతకొచ్చు. ఏడాదంతా నీళ్లుంటున్నయ్. బోరుంది. కరెంటు ఫ్రీగనే ఇస్తున్నరు. రైతు బాధలు ఇట్ల పోతయని, మంచిరోజులొస్తయని ఎన్నడూ అనుకోలే. వచ్చిన దండగలేదో వచ్చినయ్. పోయినయ్. ఎవుసం చేస్తే లచ్చలు రాకున్నా చేతినిండా పని, కడుపునిండా బువ్వ పెడితే సాలు! ఇప్పుడైతే బువ్వ పెడుతంది.
ఎకరంన్నర భూమి అమ్మి ఆ బర్ల లోన్ తీర్చంగ రెండెకరాలు మిగిలింది. చేసిన చాకిరీకి కూలి, పెట్టుబడి ఖర్చు పోంగ మిగిలితే మిగులుతై లేకుంటె లేదు. ఊరికనే ఉండలేక ఈ ఎవుసం చేస్తున్నం. మేం ముదిరాజులం. మా ఆయన (యాదయ్య)కు ఏడాది నుంచి కల్లుగీత పింఛన్ వస్తంది. రైతుబంధు సాయం ఇస్తున్నరు. చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్టు వాటితోనే కొంత మేలు జరిగింది. ఇంత బువ్వ తింటున్నం. కొడుకుని సదివిస్త ఎవుసం చేసుకుని బతుకుతున్నం. కేసీఆర్ పాలన జెయ్యబట్టి ఇప్పుడిట్లున్నం. ఇరిగిన కొమ్మ చిగురించినట్టు మళ్లీ ఎవుసం జేయాల్ననిపిస్తంది అందరికీ. ఏమో లాభాలెంతొస్తయో జూడాలె.
పదేండ్ల కింద..
లోన్ తీసుకొని పది బర్లు కొన్నం. ఆరు నెలలదాంక మంచిగనే పాలు ఇచ్చినయ్. కాలంగాలేదు. వానల్లేవు. బోర్లు ఎండిపోయినయ్. భూమి బీడువడే. వరి పండలే. మేతే దొరకలేదు. నీళ్లు లేవు. పోచంపల్లి నుంచి గడ్డి ట్రాక్టర్లలో కొని తెచ్చినం. ఒక్క ట్రాక్టర్గడ్డి పది వేలకు కొన్నం. అట్ల ఏడాదికి లక్షన్నర రూపాయలు గడ్డికే అయిపోయినయ్. ఏడాదిన్నర తర్వాత లోన్ కిస్తీలు కట్టలేక పోయినం. మేతకొట్టుబడి కాళ్లు అల్లుకపోయినయ్. నీరసమొచ్చి పడిపోయేయి. మేతలేక బర్లు ఒర్రి సచ్చినయ్. ఐదు బర్లు, తొమ్మిది దూళ్లు అట్లనే సచ్చిపోయినయ్. చేసేది లేక మిగిలినవాటిని కటికోళ్లకు అమ్ముకున్నం. ఇన్సూరెన్స్‌కి పోతే టైమ్ అయిపోయిందని పైసలియ్యలే. ఆ బర్లతోని అయ్యా చానా బాధలువడ్డం. బర్లు చచ్చి.. దూడలు సచ్చి రెండు ఈత బొత్తలు నమ్ముకుని బతికినం. లేకుంటె ఉరేసుకుని సచ్చేదుండె.
ఎనిమిదేండ్ల కింద..
మునుగ పెట్టినం. అప్పుడు కాపు మంచిగనే ఉండె. కానీ, గాలి దుమారానికి కొమ్మలన్నీ ఇరిగిపోయినయ్. ఆ తోట దండగొచ్చింది.
అయిదేండ్ల కింద..
మునగతోట మమ్ముల ముంచిన మూడేండ్ల తర్వాత నిమ్మతోట పెట్టినం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతోని గుంటలు తీయించినం. వానల్లేక, నీళ్లు లేక ఆ నిమ్మతోట ఎండిపోయింది. పండనిది ఎందుకని పీకేశినం. మునగ అట్లయింది. నిమ్మ ఇట్లబోయింది. ఇన్ని బాధలు పడుకుంట ఎట్ల బతికినమో? ఆ దేవునికే ఎరుక!