యాదాద్రి, నవంబర్ 2 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా సాగాయి. ప్రధానాలయంతోపాటు అనుబంధ రామలింగేశ్వరాలయంలో కార్తిక దీపారాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. తెల్లవారుజూము నుంచే మహిళలు 365 ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించి పూజల్లో పాల్గొన్నారు. కార్తిక వ్రత పూజలు వైభవంగా సాగాయి. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 201 మంది దంపతులు వ్రతపూజల్లో పాల్గొన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్యకల్యాణ తంతును నిర్వహించారు.
తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళలో స్వామివారికి వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలు అత్యంత వైభవంగా చేపట్టారు.
స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనంలో మరో 319 మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,84,165 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.