పోలింగ్‌కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందించాం. అన్ని పోలింగ్ బూత్‌లకు మెటీరియల్ వెళ్లింది. 298 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశాం. ప్రతి రెండు పోలింగ్ స్టేషన్లకు ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించాం. రెండు కంటే ఎక్కువ పోలిం గ్ స్టేషన్లు ఉన్న దగ్గర ఇద్దరు, ముగ్గురు మైక్రో అబ్జర్వర్లను పెట్టాం. రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాం.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి.. ఎలాంటి చర్యలు చేపట్టారు?
నియోజకవర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.
ఓటరు స్లిప్పుల పంపిణీ ఎలా జరిగింది?
ఇప్పటికే 97శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశాం. కొందరు బయట ఉండటం, మరికొందరు చనిపోవడంతో మిగిలిపోయాయి. స్లిప్పులు అందనివారు ఓటరు కార్డుతోపాటు నిర్దేశించిన డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపించాలి.
పోలింగ్ శాతం పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఇప్పటికే ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించాం. ప్రతి గ్రామంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్రచార రథాల ద్వారా ఓటర్లలో అవగాహన, చైతన్యం కల్పించాం. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇదే సమయంలో ఏ ఒక్కరూ ప్రలోభాలకు గురికావద్దు. ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని భావిస్తున్నాం.
పోలింగ్ బూత్‌లో వెలుతురు సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
పోలింగ్ స్టేషన్లలో వెలుతురు సమస్య అంశం మా దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో మంచి లైటింగ్ ఏర్పాటు చేశాం. నిరంతరం కరెంట్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
80ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులను సంప్రదించాం. వారికి రవాణా కావాలని అడిగారు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. వాళ్లు ఓటరును ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొస్తారు. ఓటు వేశాక తిరిగి ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. పోలింగ్ స్టేషన్‌లోని ప్రతి లోకేషన్లో వీల్చైర్తోపాటు దాన్ని నెట్టడానికి వలంటీర్లను అందుబాటులో ఉంచాం. వాళ్లను ఇంటి నుంచి తీసుకొచ్చి.. ఓటు వినియోగించుకున్నాక ఇంటి దగ్గర దించేవరకు మేమే చూసుకుంటాం.
పోలింగ్‌కు ఎంత మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు?
1,470 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. 15 కేంద్ర బలగాలతో సహా 3,300 మంది పోలీసులు అందుబాటులో ఉంటారు.
మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది?
సాధారణంగా మాక్ పోలింగ్ ఎప్పుడు కూడా ఉదయం ఆరు గంటలకే ఉండేది. కానీ.. ఈసారి 5:30గంటలకే ప్రారంభిస్తున్నాం. దీనిపై అభ్యర్థులందరికీ అవగాహన కల్పించాం. పోలింగ్ ఏజెంట్లందరూ 5గంటలకే చేరుకోవాలి. ఫామ్-10ని నింపి, ఐడెంటిటీ కార్డు తీసుకోవాలి.
పోలింగ్‌కు ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తున్నారు?
ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ప్రతి రెండు గంటలకోసారి కచ్చితమైన పోలింగ్ శాతాన్ని తెలియజేస్తుంది. దాన్ని ఉపయోగించుకుని గురువారం ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతాన్ని విడుదల చేస్తాం.
ఎన్నికల సిబ్బందికి ఏం సామగ్రిని అందించారు?
సిబ్బందికి ఇచ్చే సామగ్రిని మూడు రకాలుగా స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ, ఈవీఎంలుగా విభజించాం. వెరిఫికేషన్ తర్వాత ఈవీఎంలను సిబ్బంది టేబుల్ వద్దే అందించాం. ఇప్పటికే ఆయా పోలింగ్ బూత్‌లకు సామగ్రి చేరింది.
ఎన్ని ఈవీఎంలను వినియోగిస్తున్నారు?
ఉప ఎన్నికలో 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకటి నోటా ఉంటుంది. మొత్తం 48 గుర్తులకు మూడు బ్యాలెట్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక్కొక్కటి ఉంటాయి. సాయంత్రం పోలింగ్ ముగిసి.. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.