మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ నేడు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఉప ఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు ఉన్నారు. 298 పోలింగ్ స్టేషన్లలో 2,41,855 మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలివెల ఘటన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను నల్లగొండకు తరలించి స్ట్రాంగ్
రూమ్‌లో భద్రపర్చనున్నారు.
ఉదయం 7గంటల నుంచి..
మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 2,41,855మంది ఓటర్లు(పురుషులు 1,21,720మంది, స్త్రీలు 1,20,128మంది) ఉండగా, ఉప ఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 193 సాధారణ, 105 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇప్పటికే గ్రామాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. ఆన్లైన్లో కూడా స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అంతకు ముందు ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను నియమించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాంను ఏజెంట్లు నింపాల్సి ఉంటుంది.
పోలింగ్ స్టేషన్లకు తరలిన సామగ్రి..
బుధవారం ఉదయం చండూరు మండల కేంద్రంలోని డాన్ బాస్కో కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కలెక్టర్, అబ్జర్వర్, ఆర్వో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా సూచనలు చేశారు. మధ్యాహ్నం వరకు సిబ్బందికి పోలింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. సాయంత్రం వరకు అన్ని స్టేషన్లకు సామగ్రిని తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది సామగ్రిని తరలించే సమయంలో పోలీసులు బందోబస్తు కల్పించారు. సిబ్బంది రాత్రి అక్కడే బస చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, అదనపు ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, మరో ముగ్గురు సిబ్భంది పని చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు 373మంది పీవోలు, 740జీపీవోలను నియమించారు. మొత్తంగా ఉప ఎన్నికలో 1192ఈవీఎంలు, 596వీవీ ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉంచారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
నియోజకవర్గంలో పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. దీన్ని నల్లగొండలోని కలెక్టర్ కార్యాలయం నుంచి మానిటర్ చేయనున్నారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి, అట్నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించనున్నది. ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోకున్నారు. ఇక ఎన్నికల్లో తొలిసారిగా ప్రతి గంటకు పోలింగ్ శాతం తెలుసుకునేలా ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు
పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. వీరిని తీసుకొచ్చేందుకు, తీసుకెళ్లేందుకు సిబ్బందిని నియమించారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. బయట మెడికల్ టీంలను అందుబాటులో ఉంచనున్నారు.
పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంలు
మునుగోడు ఉప ఎన్నికలో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. అప్పటి వరకు లైన్లో ఉన్నోళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఈవీఎంలను సీజ్ చేయనున్నారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు నడుమ నల్లగొండకు తరలించనున్నారు. నల్లగొండ శివారులోని ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరచనున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండామూడంచెల భద్రత కల్పించనున్నారు. ఇక ఈ నెల 6వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
పటిష్ట బందోబస్తు
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఎన్నికల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3365మంది పోలీస్ సిబ్భందితోపాటు 15 కంపెనీల కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచారు. 14ఫ్లయింగ్‌స్కాడ్ అండ్ స్టాటిక్ సర్వేలైన్స్ టీంలు, 14 స్టేట్ సర్వేలైన్స్ బృందాలు, 14వీడియో సర్వేలైన్స్ టీంలను సిద్ధం చేశారు. 199 మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. నియోజకవర్గ పరిధిలో 100 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పలిమెలలో ఘటన దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక అన్ని పోలింగ్ స్టేషన్లలో మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి.