నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మైకులు మూగబోయాయి. నెల రోజులకుపైగా సందడిగా ఉన్న నియోజకవర్గం ఒక్కసారిగా గప్‌చుప్‌గా మారింది. బయటి ప్రాంతాల నుంచి ప్రచారం కోసం వచ్చిన వివిధ పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు, వ్యక్తులు నియోజకవర్గం విడిచివెళ్లారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం చండూరులోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు వెళ్లనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ప్రకటించారు.
ప్రచార హోరుకు తెర
మునుగోడు ఉప ఎన్నికల ప్రచార హోరుకు తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉన్నది. ఈవిధంగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం ముగిసింది. ప్రచార రథాలు ఎక్కడికక్కడే ఆగిపోగా, ఎన్నికల కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. ఇక మైకులు, డీజే సౌండ్స్, జెండాల రెపరెపలు ఆగిపోయాయి. దాంతో నియోజకవర్గం అంతటా ఒక్కసారిగా ప్రశాంతం వాతావరణం కనిపిస్తున్నది. ఇన్నాళ్లూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లిన ఊళ్లు శాంతించినైట్లెంది.
మంత్రుల రోడ్‌షోలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండూరులో భారీ బహిరంగసభకు హాజరుకాగా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హారీష్‌రావు పలుచోట్ల రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇక జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఎన్నికలను తన భుజస్కందాలపై వేసుకుని ముందుకు నడిపించారు. పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ ప్రచార వ్యూహాంలో కీలకపాత్ర పోషించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజవర్గంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఓటు అభ్యర్ధించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలంతా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం 47 మంది అభ్యర్థులు ఉప ఎన్నికల బరిలో నిలవగా అంతా తమ తమ స్థాయిల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచార గడువు ముగియడంతో అందరూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇన్నాళ్లు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇక ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంపై దృష్టి సారించారు. ఉప ఎన్నికలు కావడంతో పోలింగ్ భారీగానే నమోదు కావచ్చని అంచనా.
పోలింగ్‌కు ఏర్పాట్లు
రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న అన్ని భవనాల పరిధిలో కార్యకలాపాలకు సెలవు ప్రకటించారు. ఇక పోలింగ్ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా సెలవు ఇచ్చారు. బుధవారం చండూరులోని డాన్‌బాస్కో కళాశాలలో డిస్ట్రిబ్యూటరీ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్ సిబ్బంది బుధవారం ఉదయం డిస్ట్రిబ్యూటన్ కేంద్రానికి చేరుకుంటారు. వీరికి ర్యాండమ్‌గా పోలింగ్ కేంద్రాల వారీగా విధులు కేటాయించాక అక్కడే వారికి సామగ్రిని అందజేయనున్నారు. సాయంత్రానికే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నికల్లో రకరకాల అధికారుల బృందాలు నియోజకవర్గలో విస్త్రతంగా పర్యటిస్తున్నాయి. ముగ్గురు ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, మనీ సర్కూలేషన్పై నిఘా కోసం ఐటీ బృందాలు రంగంలో ఉన్నాయి. మొత్తంగా ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రకటించారు.