మునుగోడు రూరల్, నవంబర్ 1: మునుగోడు మండలం పలివెలలో మంగళవారం బీజేపీ గూండాలు బరితెగించారు. టీఆర్ఎస్ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
దారివ్వమంటే దాడి
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోకు కిష్టాపురం, ఇప్పర్తి గ్రామాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు బయల్దేరాయి. వారు పలివెల గ్రామానికి చేరుకోగానే అప్పటికే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్థానిక చౌరస్తాలో మాట్లాడుతున్నారు. రోడ్డు పూర్తిగా బ్లాక్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు అరగంటకు పైగా ఎదురు చూశారు. అనంతరం తమకు దారి ఇవ్వాలని పోలీసులను కోరగా వారు దారి క్లియర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈటెల వెంట వచ్చిన బీజేపీ గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బీజేపీ శ్రేణులు టేఆర్ఎస్ కార్యకర్తల వైపు దూసుకొచ్చేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఇదే సమయంలో ఈటెల ప్రోద్బలంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చి పోయారు.
పథకం ప్రకారమే..
టీఆర్ఎస్ శ్రేణులపైకి కర్రలు, రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. టీఆర్ఎస్ నాయకులు వారిని నిలువరించే ప్రయత్నాలు చేయగా పథకం ప్రకారం వారిపై కర్రలతో దాడి చేశారు. ఈటెల రాజేందర్ పీఏ నరేశ్‌తో పాటు అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కంకణాల సురేందర్‌రెడ్డి, గడ్డం సాయికుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఉన్న వైపు దూసుకెళ్లారు. అదే సమయంలో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి వచ్చారు. ఘర్షణను నివారించే ప్రయత్నం చేయగా ఆయనపై కకూడా ఈటెల రాజేందర్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాంతో ఆయన ఎడమ చెవికి గాయమైంది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, నాతి సురేశ్, భవనం శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి స్థానికంగా చికిత్స అందించారు.
పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు
టీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడిన, ప్రోత్సహించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఆయన సతీమణి ఈటెల జామున, కంకణాల సురేందర్‌రెడ్డి, గడ్డం సాయిపై టీఆర్ఎస్ నాయకులు నల్లగొండ ఎస్పీతో పాటు మునుగోడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలివేల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈసీకి కూడా ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.