నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి/ సూర్యాపేట, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పూర్తయింది. ఈ ఎన్నికకు కారణమైన బీజేపీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడినఎలుకలా తయారైంది. డబ్బుతో ఓటర్లను మాయ చేయొచ్చని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటర్లు చుక్కలు చూపిస్తుండడంతో లబోదిబోమంటున్నాడు. కోట్లు కుమ్మరించినా జనం కనీసం పట్టించుకోవడం లేదని ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దారుణ పరిస్థితి చూడలేదని మదన పడుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించి బీజేపీ అడ్డంగా బుక్కవడంతో ఆ పార్టీ జనంలో అబాసుపాలైంది. గెలుపుపై ఇంతకాలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన రాజగోపాల్‌రెడ్డికి ఇప్పుడు ఒంటరై ఏడ్వడం ఒక్కటే తక్కువైందని ఆ పార్టీ వర్గాలే జాలి పడుతున్నాయి. మునుగోడులో తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఉహించలేదని ప్రచారానికి వెళ్లి వచ్చిన రాజగోపాల్‌రెడ్డి భార్య ఓ టీవీ చానల్‌తో వాపోయారంటే బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సిట్టింగ్ సీటు కావడంతో రాజ్ గోపాల్‌రెడ్డి పట్ల వ్యతిరేకత తమకే సానుకూలంగా మారుతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ అంచనాలు తారుమారయ్యా యి. గులాబీ దూకుడుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కకావికలం అయ్యాయి. ఉప ఎన్నికపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వాటి అనుబంధ సంఘాలు నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ తేలిందని సమాచారం.
పని చేయని బీజేపీ వ్యూహాలు
మునుగోడులో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా వర్క్‌వుట్ కావడం లేదని స్వయంగా పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. ప్రజలు తమను నమ్మడం లేదని అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబా ద్, హూజూర్‌నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కానీ, మునుగోడు ఉప ఎన్నికకు ఎలాంటి ప్రత్యేక కారణం లేదని ప్రజలే అంటుండడంతో తాము సమాధానం చెప్పలేని స్థితి దాపురించిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కేవలం బీజేపీ బలవంతంగా తెచ్చిన ఉప ఎన్నిక అని, అందుకే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ఉపఎన్నిక ఎవరి కోసం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. దాంతో ఏ విధంగా ప్రచారం చేసినా నమ్మడం లేదని, తిరిగి ఎదురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని పేర్కొం టున్నారు.
ఒక్కటైన తెలంగాణ బిడ్డలు
తెలంగాణపై నిలువెల్లా విద్వేషాన్ని వెళ్లగక్కుతున్న ప్రధాని మోదీ, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు తిరిగి సొంతగూటికి చేరుకొంటున్నారు. తెలంగాణ సమాజానికి పరీక్ష అంటూ వస్తే తామంతా ఒక్కటవుతామని నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీకి దాసోజు శ్రవణ్‌కుమార్, శాసన మండలి తొలి చైర్మన్‌గా వ్యవహరించిన స్వామిగౌడ్ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. మరో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీని వదిలి కారెక్కారు. వీరితో పాటు ఇంకా చాలా మంది బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ వరుస పరిణామాలతో మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి శిబిరం నైరాశ్యంలో పడింది. వారం రోజులుగా రాజగోపాల్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో తీవ్ర అసహనానికిలోనై ప్రతి చిన్నదానికి చిందులేశారు. ఎన్ని కోట్లు కుమ్మరించినా మునుగోడు ప్రజలకు దగ్గరకాలేపోతున్నాననే ఆందోళన ఆయనలో వ్యక్తమవుతున్నదని ఆయన్ను దగ్గరగా గమనించిన వారు అంటున్నారు. రోజురోజుకు తన గ్రాఫ్ పడిపోవడం, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అన్ని వర్గాలు బలపరుస్తుండటడంతో రాజగోపాల్ నైరాశ్యానికి లోనయ్యారని ప్రచారాలు ముగిసాక ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
బీజేపీ బిక్కముఖం
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో తన అనుచరులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలతో వరుస మీటింగ్‌లు పెట్టగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, శ్రేణులు తరువాత ముఖం చాటేశారు. పార్టీలో చేరితే తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీజేపీ నేతలు సైతం ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరిపోవడంతో కోమటిరెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. మునుగోడు మొదటి నుంచి వామపక్ష భావజాలం కలిగిన ప్రాంతం కావడంతో అక్కడ బీజేపీ ఎన్నడూ బలపడలేదు. దాంతో రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పుడు హస్తం పార్టీ ఓట్లను పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. రాజగోపాల్‌రెడ్డికి ఉన్న ఆర్థికబలంతో గెలుపు తేలికేనని బీజేపీ అధిష్ఠానం మొదట అంచనా వేసింది. బీజేపీ జాతీయ నాయకులు వరుసగా ప్రచారానికి వచ్చారు. కానీ, మునుగోడులో పరిస్థితి అంచనాలకు భిన్నంగా ఉండడంతో హుటాహుటిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఢిల్లీకి పిలిపించి ఆరా తీసింది. పార్టీకి రెండో స్థానమైనా దక్కే పరిస్థితి లేదని తేలడంతో, జాతీయ నాయకులు ప్రచారానికి రావట్లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
అన్ని వర్గాలు టీఆర్ఎస్కు జై
మునుగోడులో కులం, మతం అన్న తేడా లేకుండా అన్నివర్గాలు టీఆర్ఎస్కే జై కొడుతున్నాయి. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేకపోవడం, అలాగే అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతానికిపైగా ఓటర్లు టీఆర్ఎస్కే ఓటేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పట్టణప్రాంతాల్లో కొంతవరకు ఊగిసలాట ఉన్నప్పటికీ, 50 శాతానికిపైగా ఓటర్లు ఇప్పటికే టీఆర్ఎస్కు జైకొడుతున్నట్లు ట్రెండ్‌ను బట్టి తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే కాంగ్రెస్, బీజేపీకి అందనంత ఎత్తులో టీఆర్ఎస్ ఉన్నదని ఓటర్ల నాడి తెలిసిన విశ్లేషకులు పేర్కొంటున్నారు. గౌడ్, యాదవ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, వడ్డెర, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ తదితర సామాజికవర్గాల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్కు పడబోతున్నాయని అంటున్నారు. నియోజకవర్గంలో చౌటుప్పల్, గట్టుప్పల్, మర్రిగూడ, నారాయణపురం,చండూరు, మునుగోడు మండలాలు ఉండగా, అన్ని మండలాల్లో టీఆర్ఎస్కే బంపర్ మెజారిటీ ఉన్నదని చెప్తున్నారు. పార్టీల పరంగా చూస్తే టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయని అంటున్నారు. అందునా మొదటిస్థానంలో ఉన్న టీఆర్ఎస్ కంటే రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 10 శాతం కంటే ఎక్కువ ఓట్ల తేడా ఉన్నదని, కాంగ్రెస్ కంటే బీజేపీ మరో 10 శాతం ఓట్ల దిగువన ఉన్నదని విశ్లేషిస్తున్నారు.
ముందుగా బిచాన ఎత్తేసిన వ్యూహకర్తలు
ఎన్నికల సమయంలో బీజేపీ అనుసరించి బాహ్యప్రచార ఆర్భాటం కన్నా అంతర్గత కార్యాచరణే ప్రధానంగా సాగుతుంటుంది. పార్టీ కండువాలు లేకుండా అంతర్లీనంగా ఒక వర్గం పనిచేస్తూ పోతుంటది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నిక గెలుపులో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీ, ఏబీవీపీ కీలకంగా వ్యవహరించినట్టు ఆ పార్టీ వర్గాలే చెప్పుకొన్నవి. ఆ రెండు నియోజకవర్గాల్లో అనుసరించిన విధంగా మునుగోడులో ప్లాన్ చేశారు. అయితే మిగతా నియోజకవర్గాల కన్నా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులున్నాయి. మునుగోడులో ప్రజల కోసం కాకుండా కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామా చేశారని ప్రజలు బల ంగా విశ్వసిస్తూ వస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, యూపీలో రెండోసారి యోగీ సర్కార్‌ను అధికారంలోకి తెచ్చారనే ముద్రపడ్డ సునీల్‌బన్సల్, సహా ఇన్చార్జి అరవింద్ మీనన్ బృందం కొంతకాలంగా మునుగోడులోనే తిష్టవేసి ప్రచార వ్యూహాన్ని నిర్దేశించాయి. పార్టీపై వ్యతిరేకత, టీఆర్ఎస్పై అభిమానం, చేజారిపోతున్న నాయకులతో ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలువలేమని యూపీ బ్యాచ్ నిర్ధారణకు వచ్చి ముందే పలాయనం చిత్తగించినట్లు హైదరాబాద్‌కు చెంది పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించి ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చెప్పాడు.