చౌటుప్పల్ రూరల్, నవంబర్ 1 ఓటమి భయంతోనే బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తప్పదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇప్పటికే అర్థమైందన్నారు. అందుకే తన అనుచరులతో టీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో మంగళవారం గడపగడపకూ వెళ్లి ప్రచారం చేశారు. తొలుత గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసేందుకు ఒక్క తాటిపైకి వచ్చారని తెలిపారు. దీనిని రాజగోపాల్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని, అందుకే దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనించాలన్నారు. దాడులకు పాల్పడే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే టీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ జాల మమత, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్ యాదవ్, ఎన్నపల్లి ముత్తిరెడ్డి పాల్గొన్నారు.