నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మునుగోడును అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం. నాటి ఉద్యమనేత, నేటి బంగారు తెలంగాణ ప్రదాత కేసీఆర్ సారథ్యంలోనే 2014 తర్వాత మునుగోడులో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. తీవ్రంగా ఉన్న తాగు, సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు మొదలుపెట్టాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించి ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టాం. సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపట్టాం. మరోసారి అవకాశమిస్తే నాలుగేండ్లుగా ఆగిపోయిన అభివృద్ధి పనులను కొనసాగిస్తాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
సీఎం కేసీఆర్‌కు మునుగోడుపై ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక శ్రద్ధ ఉంది. అప్పట్లో ఇక్కడి ఫ్లోరైడ్ బాధలు చూసి చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మిషన్ భగీరథ పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. చౌటుప్పల్‌లో పైలాన్ ఆవిష్కరించి ఇంటింటికీ నల్లా నీళ్లివ్వడంతో ఫ్లోరైడ్‌కు చెక్ పడింది.
నియోజకవర్గాన్ని అనాథగా వదిలేసిన రాజగోపాల్
సమైక్య రాష్ట్రంలో నియోజకవర్గంలోని రహదారులు అధ్వానంగా ఉండేవి. 2014లో నేను గెలిచాక ప్రధాన సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించాం. ఇంకా కొన్ని రహదారుల పనులు చేయాల్సి ఉంది. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాం. రాజగోపాల్‌రెడ్డి నిర్లక్ష్యంతో 2018 నుంచి పనులు ఆగిపోయాయి. ఒక్క అభివృద్ధి పనిని కూడా ఆయన కొత్తగా ప్రారంభించలేదు. చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా సరే.. ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేపట్టవచ్చు. రాష్ట్రంలో ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తలేరా? రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంపై ఏ మాత్రమూ ప్రేమ లేదు. దేన్నీ పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని అనాథగా వదిలేశారు. కుటుంబ కంపెనీ కోసం రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వగానే పార్టీ మారి అభివృద్ధి కోసమే అంటున్నాడు. దీన్ని ప్రజలెవరూ నమ్మడం లేదు. నాలుగేండ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోలేదు. మెజార్టీ గ్రామాలను ఆయన తొంగి చూడలేదు. ప్రజలంతా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఉప ఎన్నికతో అవకాశం వచ్చిందనుకుంటున్న నియోజకవర్గ ప్రజలు.. రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.
దత్తతతో మరింత అభివృద్ధి
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ సైతం చండూరు సభలో మునుగోడును గుండెల్లో పెట్టుకుంటామన్నారు. మునుగోడు ప్రజలపై టీఆర్ఎస్కు ఉన్న ప్రేమకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తున్నది. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్యకు ఇంచుమించుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్న మాట వాస్తవం. ఈ ప్రాంతంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇతర వృత్తిదారులందరికీ పథకాలను వర్తింపజేస్తున్నారు. ఇక మిగిలిపోయిన అభివృద్ధి పనులపైనా దృష్టి సారిస్తాం. ఉప ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. నన్ను ఆశీర్వదించి, అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.’ అని టీఆర్ఎస్ అభ్యర్థ్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టుల పూర్తి నా జీవితాశయం
సాగునీటి వసతి లేని మునుగోడు కోసం డిండి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించి నియోజకవర్గం పరిధిలో చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటి ద్వారా నియోజకవర్గంలోని 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది కేసీఆర్ లక్ష్యం. కానీ.. 2018లో ఇక్కడి ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని గెలిపించారు. ఆయన గెలిచిన నాటి నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు సృష్టించారు తప్ప.. పూర్తి కావాలని ఆయన ఏనాడూ కోరుకోలేదు. కోర్టు కేసులు, ఇతరత్రా చర్యలతో ప్రాజెక్టు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని పూర్తి చేయడం నా జీవితాశయం. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలను బాగు చేసుకున్నం. దాంతో నియోజకవర్గంలో ఇప్పుడు ఏ చెరువును చూసినా నీళ్లతో కళకళలాడుతున్నాయి.