సంస్థాన్‌నారాయణపురం, నవంబర్ 1: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిల్లాపురం ఎంపీటీసీ పరిధిలోని లచ్చమ్మగూడెం, కొర్రతండా, డాకుతండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మునుగోడులో ఫ్లోరైడ్ పీడను రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులకు అమ్ముడుపోయి ప్రజలను విస్మరించారని విమర్శించారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలోఎంపీటీసీ కరెంటోత్ విజయాదశరథ, సర్పంచులు దోటి మంజుల, జన్నాయికోడె అలివేలు, కొర్రి లచ్చిరాంనాయక్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాశం ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.