గట్టుప్పల్, నవంబర్ 1: బీజేపీ పతనం మునుగోడు ఉపఎనిక ఫలితాలతోనే ప్రారంభం కానున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజైనా మంగళవారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం లో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను వినూత్నరీతిలో అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు. అది జీర్ణించుకోలేని బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతుందన్నారు. ఇప్పటికే ఆయా రాష్ర్టాలలో తమ రాక్షస రాజకీయాలను ఉపయోగించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను విచ్చిన్నం చేసే స్థాయికి దిగజారారన్నారు. తెలంగాణలో సైతం అదే బుద్ధిని ప్రదర్శించిన బిజెపి నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తిప్పి కొట్టి వారి దొంగబుద్ధిని బయట పెట్టిన విషయాన్ని యావద్దేశం చూసిందన్నారు.
ఇప్పుడు మునుగోడులో బిజెపి ఓడిపోతుందని భయంతోనే మరింత దిగజారుడు రాజకీయాలకు బిజెపి పాల్పడుతుందని వారి పతనం ఈ ఉప ఎన్నిక ఫలితాలు నుండే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. రేపు జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని రంగాల ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అలాగే ఈనెల 6న వెలువలనున్న ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 40 నుంచి 50 వేల మెజారిటీతో గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పవర్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, ఈడెం కైలాస్, అవ్వారి శ్రీనివాస్, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.