పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. నిత్యం ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు డీజిల్ ధరలు శరాఘాతంగా మారుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాల్లో 1,01,161 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఎనిమిదిన్నరేండ్లుగా పెరిగిన డీజిల్ ధరలతో ఏకంగా రూ.159 కోట్ల అదనపు భారం పడింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో లీటరు డీజిల్ ధర రూ.54.60 ఉంటే, ఎనిమిదిన్నరేండ్లలో ఏకంగా రూ.43 పెరిగి లీటరు నేడు రూ.97.78కు చేరుకున్నది. ఎనిమిదిన్నరేండ్లలో దాదాపు 1,200 సార్లకు పైగా పెట్రోల్ ధరలు పెరిగినట్లు అంచనా.
సూర్యాపేట, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి బుక్కెడు బువ్వకు.. గుక్కెడు నీటికి నోచని పేద, మధ్య తరగతి వర్గాలు అత్యంత దుర్భరమైన జీవనం గడుపగా, తె లంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం జోడెడ్లలా సమాంతరంగా పరుగులు పెట్టి స్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రా ష్ట్రం ఇస్తున్న డబ్బులు ఆవిరవుతున్నాయి. నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడు వాహనం నడిపే పరిస్థితి లేకుండాపోతున్నది. ఇక రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 23,39,297 ఎకరాల వ్యవసాయ భూములుండగా, కృష్ణా, గోదావరి, మూ సీ, డిండి తదితర అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండటం.. వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతో వ్యవసాయం పండుగలా మారి ప్రతి గుంట భూమినీ సాగు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నీళ్లు, విద్యుత్ కొరత లేకుండా చేశారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో రావడం ఒక ఎత్తయితే, అ న్నింటికీ మించి పెట్టుబడి సాయం ఇవ్వడంతో రైతుకు కొం డంత అండ దొరుకుతున్నది. ఓ పక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆదాయం పెంచుతుంటే, మరో పక్క మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతిని పీల్చి పిప్పి చేస్తున్నది. ఇక సాగు సంబురం కావడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉంటుండగా, మోదీ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచుతుండటంతో నొప్పి తెలియకుండానే రైతులకు బాధ కలిగిస్తున్నది. ఇక మునుగోడు విషయానికొస్తే, నియోజకవర్గంలో 2.29లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 1,01,161 మంది రైతులు ఉన్నారు. 1.26లక్షల ఎకరాల్లో వరి, 1.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, మరో వెయ్యి ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
1,01,161మంది రైతులపై రూ.159 కోట్ల అదనపు భారం ..
2014లో కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న డీజిల్ ధరలతో పోల్చితే మునుగోడు నియోజకవర్గ రైతాంగంపై దా దాపు రూ.159 కోట్ల అదనపు భారం పడింది. రోజురోజుకూ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పెరుగుతుండటం.. యాంత్రీకరణ వైపు రైతులు మొగ్గు చూపుతుండటంతో దుక్కులు దున్నడం నుంచి పంట కోసి విక్రయించే వరకు యంత్రాలనే వినియోగిస్తు న్నారు. యంత్రాలకు డీజిల్ వినియోగిస్తుండటం.. డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రైతులపై భారం పడుతున్నది. సాధారణంగా ఎకరా భూమి సాగు చేసేందుకు తొలి నుంచి పంటను కోసేందుకు ఆరు గంటల పాటు ట్రాక్టర్‌ను వినియోగిస్తారు. అలాగే పంట కోసేందుకు హార్వెస్టింగ్ మిషన్‌తో పాటు మధ్యలో మందుల పిచికారీకి చేసేందుకు 2.15 గంట సమయం పడుతుంది.
అంటే రైతులు ఎకరాకు సుమారు 8.15 గంటల పాటు యంత్రాలు వినియోగిస్తున్నారు. వీటన్నింటికీ కలిపి దాదాపు 29 లీటర్ల డీజిల్ ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014లో డీజిల్ లీటరుకు రూ.54.60 ఉండగా, నేడు రూ.97.78కు చేరింది. ఈ లెక్కన ఎనిమిదిన్నరేండ్లలో లీటరుకు రూ.43 పెరిగింది. అయితే ఎనిమిదిన్నరేండ్ల కాలంలో పెరిగిన రూ.43ను యావరేజ్ చేస్తే, లీటరు ఒక్కంటికి దాదాపు పెరిగింది రూ.30గా లెక్కించవచ్చు. అంటే పెరిగిన డీజిల్ ధర ప్రకారం ప్రతి ఎకరాకు రైతులపై రూ.870 అదనపు భారం పడుతున్నది. అంటే నియోజక వర్గ పరిధిలో సాగవుతున్న 2.29 లక్షల ఎకరాలపై 19.93 కోట్లు అవుతుండగా, ఈ లెక్కన ఎనిమిదిన్నరేండ్లలో రూ.159 కోట్ల భారం పడింది.
సీఎం కేసీఆర్ ఇస్తుంటే.. మోదీ జలగలా పీల్చేస్తున్నారు..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసి, అన్నీ సమకూర్చుతూ రైతుల మోముల్లో సంతోషాలు నింపుతుంటే, మరో పక్క డీజిల్ ధరల పెంపుతో మోదీ రైతులను జలగలా పట్టి పీల్చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సాగుకు కావాల్సిన నీరు, 24 గంటల ఉచిత కరంటు, సాగు సీజన్‌కు ముందే ప్రతి ఎకరాకు రైతుబంధు ద్వారా రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు కలిపి రూ.10వేలు ఇస్తున్నారు. అలాగే రైతు ఏ కారణంతోనైనా చనిపోతే, బాధిత కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా వారం రోజుల్లోనే రూ.5లక్షలు వస్తున్నాయి. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు ఏనాడో మానేసి సీజన్ రాగానే దుకాణాల్లోకి వెళ్లి కొనేలా స్టాక్ ఉంచుతున్నారు. ఇలా కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేస్తే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధాని మోదీ మాత్రం డీజిల్ ధరలు పెంచడంతోపాటు పండించిన ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం, రైతుల మోటర్లకు మీటర్లు పెడుతామంటుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం పెట్టుబడి రెట్టింపు అయింది
మోదీ పాలనలో డీజిల్ రేటు పెంచడంతో వ్యవసాయం పెట్టుబడి రెట్టింపు అయ్యింది. డీజిల్ ధరలు పెంచడంతో ప్రతి ఒక్క వస్తువు మీద భారం పడుతున్నది. గ్యాస్, పెట్రోలు, డీజిల్ రేటు పెంచిన ఈ మోదీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. ఏ పార్టీ కూడా రేట్లు పెంచాలంటే భయపడేలా మునుగోడు నుంచే గుణపాఠం చేసేలా చేస్తాం.
– నారగోని ఎల్లయ్య, మునుగోడు
అడ్డగోలుగా డీజిల్ ధరలు పెంచారు..
బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచింది. సామాన్యులపై భారం వేసింది. మునుగోడు ఉప ఎన్నిల ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. డీజిల్ రేట్లు పెరుగడంతో రైతులపై ఏటా ఆర్థిక భారం తీవ్రంగా పడుతున్నది. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్న మోదీకి గుణపాఠం చెబుతాం. డీజిల్ రేట్లు పెరుగడంతో అన్ని రకాల వస్తువులు అమాంతం పెరిగిపోయాయి. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది. బీజేపీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మోదీ ప్రభుత్వం సామాన్యులకు చేసిందేమీ లేదు. భవిష్యత్‌లో చేసేదేమీ ఉండదు.
– తిప్పర్తి నరేశ్, దోనిపాముల(చండూరు)
డీజిల్ రేట్ల పెరుగుదలతో వ్యవసాయం భారమైంది..
సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న రైతుబంధు, ఉచిత కరెంటు, పుష్కలంగా నీళ్లతో వ్యవసాయం పండుగలా చేసుకుంటున్నం. ఇప్పుడు మోదీ సర్కారు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో పొలం దున్నిన కాన్నుంచి పంట కోసి, వడ్లను మార్కెట్‌కు తీసుకెళ్లే దాకా ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువ పెంచిన్రు. ఎందుకు పెంచిన్రు అని అంటే, డీజిల్ రేట్ పెరిగిందని చెబుతున్నరు. సీఎం కేసీఆర్‌తో మా బతుకులు మారాయని అనుకుంటే, మోదీ డీజిల్ రేట్లు పెంచి, వ్యవసాయాన్ని భారంగా మార్చారు. డీజిల్ రేట్లు తగ్గితేనే వ్యవసాయానికి మళ్లీ మంచి రోజులొస్తాయి. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ సార్‌కు ఓటేసి, బీజేపీకి బుద్ధి చెబితేనన్నా రేట్లు తగ్గుతాయి.
– బానోత్ భూరీ నాయక్, ధర్మతండా(గట్టుప్పల్)