కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన జీఎస్టీకి నిరసనగా పోస్టు కార్డుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో నేతన్నలు మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. నేతన్నలంతా ఒక్క తాటిపైకి వచ్చి ప్రధాని మోదీకి వరుసబెట్టి పోస్టు కార్డులు పంపిస్తున్నారు. వేల కొద్దీ ఉత్తరాలు రాస్తూ బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. నేతన్నలకు పలువురు ప్రముఖులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ఏంటని లేఖల్లో మండిపడుతున్నారు.
ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తే ఎలా బతుకాలని నేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని, లేకుంటే తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : చేనేతపై 12శాతం జీఎస్టీ విధించడంపై నేతన్నలు యుద్ధం ప్రకటించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటగా, నేతన్నలు పెద్ద సంఖ్యలో ప్రధానికి పోస్టు కార్డులు రాశారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నేతన్నలకు మద్దతుగా పోస్టుకార్డులను రాశారు. నేత కార్మికులు తమ పేరుతో పాటు ఇంటి అడ్రస్, తదితర వివరాలను లేఖపై పొందుపరిచారు. అంతేకాకుండా తమ మగ్గం సట్టర్పై ఉన్న జియో ట్యాగ్ నంబర్ పోస్ట్ కార్డుపై రాసి నిరసన వ్యక్తం చేశారు.
చేనేతపై కేంద్రం భారం
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా నేత కార్మికులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపింది. ప్రతి వస్తువుపై జీఎస్టీ మోత మోగిస్తూ అందినకాడికి దోచుకుంటున్న కేంద్రం.. చేనేత రంగంపైనా జీఎస్టీ పేరుతో పన్ను భారం వేసింది. గతంలో వస్త్ర పరిశ్రమపై 5శాతం జీఎస్టీ ఉండగా, ఇటీవల కాలంలో ఏకంగా 12శాతానికి పెంచింది. అంటే ఏడు శాతం జీఎస్టీ పెంచి నేతన్నల పొట్టగొట్టింది. దీనిపై అప్పట్లోనే చేనేత కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో అప్పట్లో పలు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా 12శాతం జీఎస్టీ పెంపును వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. పన్ను పెంపుతో వస్త్ర ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దాంతో నూలు, రసాయనాలు, అద్దకం రంగులు, జరీ ధరలు పెరిగాయి. ఫలితంగా చీరెల రేట్లు రెట్టింపు కావడంతో వస్ర్తాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతిమంగా నేత కార్మికుల ఉపాధిపై దెబ్బ పడుతున్నది.
జీఎస్టీతో పరిశ్రమ మూతబడే పరిస్థితి
చేనేత వృత్తి దేశ వారసత్వం, కళాసంపద. నేతన్నలంతా పేదలు, బలహీన వర్గాలకు చెదదిన వారే. అందరూ్రగ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారే. చేనేతపై జీఎస్టీ విధించడం వల్ల ఈ పరిశ్రమ మూతబడే పరిస్థితులు దాపురించాయి. నేత కార్మికులు జీవించలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గ్రహించి చేనేతపై 5శాతం జీఎస్టీని తొలగించాలి. తెలంగాణ ప్రభుత్వం నూలుపై 40శాతం సబ్సిడీ ఇస్తున్నది. దీని వల్లనే నేతన్నల మనుగడ కొనసాగుతున్నది. గత ప్రధాన మంత్రులు చేసిన విధంగా చేనేతకు సబ్సిడీలు ఇచ్చి లాభం పొందేలా భరోసా కల్పించాలి.
చేనేతపై ఎత్తివేయాలి
గతంలో ఏ ప్రభుత్వాలూ చేనేతపై భారం మోపలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొదట 5శాతం జీఎస్టీ విధించింది. ఇప్పుడు దాన్ని 12శాతానికి పెంచాలని చూస్తున్నది. ఇలా పెంచితే చేనేత కార్మికుల ఆకలిచావులు పెరిగిపోతాయి. కేంద్రం పెంచడమే కాదు.. గతంలో విధించిన 5శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. జీఎస్టీని వెంటనే తొలగించాలని కోరుతూ ఈ నెల 24 జిల్లా కేంద్రంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాం. మోదీకి పోస్టుకార్డు ద్వారా చేనేతల గోసలు తెలియజేస్తాం. ఇప్పటికే 500 కార్టులు పంపించాం. ఈ ఉద్యమం జీఎస్టీ తగ్గించేవరకు కొనసాగుతుంది. అయినా కేంద్రం స్పందించకపోతే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం.
– కస్తూరి భిక్షపతి, తెలంగాణ చేనేత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు(భువనగిరి అర్బన్)
నేతన్నల బతుకులను ఆగం చేస్తున్న కేంద్రం
చేనేత కార్మికుల బతుకులను కేంద్రంలోని బీజేపీ ఆగం చేస్తున్నది. చేనేత వస్ర్తాల తయారీపై జీఎస్టీ విధించడంతో ఉత్పత్తుల ధర పెరుగుతుంది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేతకు చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుండడం హర్షణీయం. జీఎస్టీ భారంతో కార్మికులు మరింత అగాధంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించకపోతే రానున్న రోజుల్లో చేనేత వృత్తి కనుమరుగవుతుంది.
– జల్ది రాములు, చేనేత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి(ఆత్మకూరు(ఎం))
వెంటనే రద్దు చేయాలి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, అక్టోబర్ 25 : చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రామన్నపేట మండలం సిరిపురంలో నేతన్నలు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక చేనేత కార్మికులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. చేనేత కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయన్నారు. పార్టీలకు అతీతంగా చేనేత కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయండి
ప్రధాని మోదీకి ఎమ్మెల్యే గాదరి పోస్టుకార్డు
చేనేత కార్మికుల సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సంస్థాన్‌నారాయణపురం చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ప్రధాని నరేంద్రమోదీకి ఉత్తరం రాశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చేనేత రంగానికి ముప్పు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో చేనేత రంగానికి ముప్పు వాటిల్లనున్నది. చేనేత కష్టాలు తెలియని వ్యక్తి ప్రధాని మోదీ. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోస్టు కార్డు ఉద్యమం విస్తృతం చేస్తున్నాం. మోదీకి పెద్ద ఎత్తున కార్డులు రాస్తున్నాం. చేనేతపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయకపోతే నేతన్నల ఆగ్రహానికి మోదీ గురికాక తప్పదు.
– బోగ రవి, చేనేత సంఘం నాయకుడు, బేగంపేట(రాజాపేట)
జీఎస్టీ గుదిబండగా తయారైంది
నూలు, ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీతో ముడి సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. నేచిన వస్ర్తాలకు గిరాకీ లేక, గిట్టుబాటు ధర రాక పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడుతున్నది. కార్మికులకు జీఎస్టీ గుదిబండగా తయారైంది. జీఎస్టీని వెంటనే ఎత్తి వేసి చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చి కార్మికులను ఆదుకోవాలి.
– అంకం పాండు, టీఆర్ఎస్ చేనేత సెల్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు(భూదాన్‌పోచంపల్లి)
చేనేత పథకాలను కేంద్రం పునరుద్ధరించాలి
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
చండూరు, అక్టోబర్ 25 : చేనేతపై జీఎస్టీ ఎత్తివేయడంతో పాటు కేంద్రం రద్దు చేసిన చేనేత పథకాలను పునరుద్ధరించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం చండూరు మండలం కొండాపురం, నెర్మట గ్రామాల్లో ఏర్పాటు చేసిన నేతన్నల సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు, ట్రిపుల్ ఆర్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, హోం వర్క్ షెడ్, త్రిఫ్ట్ ఫండ్ లాంటి పలు పథకాలను రద్దు చేసిందన్నారు. ఇప్పుడు జీఎస్టీని 12శాతానికి పెంచిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు నేతన్నబీమా, త్రిఫ్ట్ ఫండ్, నూలు సబ్సిడీ వంటి పలు పథకాలను ప్రవేశపెట్టి, నేతన్నకు నేరుగా సాయం అందిస్తున్నదన్నారు. అలాంటి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నేతన్నలు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అవ్వారి వేణుకుమార్, ఉప సర్పంచ్ గిరి లింగస్వామి, అవ్వారి రవీందర్, చెరుపల్లి భావన, లక్ష్మి, చెరుపల్లి స్వామి, చెరుపల్లి సురేశ్, గోపాల్, దొంతగొని సంజీవ, బైరిగొండ కృష్ణయ్య, ఈరిగి నారాయణ పాల్గొన్నారు.
జీరో జీఎస్టీ చేసే దాకా ఉద్యమం
భూధాన్పోచంపల్లి, అక్టోబర్ 25 : చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో నాయకులు, చేనేత కార్మికులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి, చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మోదీకి పోస్టు కార్డులు రాశారు. ఈ సందర్భంగా నాయకులు, నేత కార్మికులు మాట్లాడారు. జీరో జీఎస్టీ చేసే దాకా ఉద్యమం ఆగదని, లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, నియోజకవర్గ చేనేత సెల్ అధ్యక్షుడు అంకం పాండు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
చేనేతపై జీఎస్టీ ఎత్తేయాల్సిందే!
కొయ్యలగూడెంలో నేతన్నల నిరసన
ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ
చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 25 : ‘మోదీ.. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు ఎత్తివేయాల్సిందేనని’ నేతన్నలు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చౌటప్పల్ మండలం కొయ్యలగూడెంలో నేతన్నలతో కలిసి ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు. జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలను రాసి పంపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, నేతన్నలు తదితరులు పాల్గొన్నారు.