నల్లగొండ, అక్టోబర్ 25 : తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు బాసటగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. చెట్టు ఎక్కే కార్మికులకు ఏదో రకమైన ప్రయోజనం చేకూర్చి అండగా నిలుస్తున్నది. 2017-18 నుంచి తాటి చెట్టుకు ప్రతి ఏటా కట్టే శిస్తును రద్దు చేసింది. 50ఏండ్లు నిండిన వృత్తిదారులు చెట్లు ఎక్కడం మానేస్తున్న నేపథ్యంలో వారికి నెలవారీగా ఇచ్చే రూ.200 ఆసరా పింఛన్‌ను రూ.2016కు పెంచింది. ఇక రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా సైతం రెండున్నర రెట్లు పెంచింది. త్వరలోనే వృత్తిదారులకు ద్విచక్ర వాహనాలు అందజేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది.
పెరిగిన ఆసరా.. ఎక్స్‌గ్రేషియా..
తాటి చెట్టు ఎక్కలేని 50ఏండ్లు నిండిన గీత కార్మికులకు సర్కారు నెలనెలా పింఛన్ అందజేస్తున్నది. రూ.200 ఉన్న పింఛన్‌ను తెలంగాణ ప్రభుత్వం రూ.2016కు పెంచింది. ఇక వారు చెట్టు ఎక్కి, ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకుంటున్నది. చెట్టుపై నుంచి కింద పడి చనిపోతే రూ.2లక్షలు వచ్చేది. దానిని తెలంగాణ సర్కారు రెండున్నర రెట్లు పెంచింది. గీత కార్మికులు ఇప్పుడు చెట్టుపై నుంచి పడి చనిపోయినా, శాశ్వత వైకల్యం పొందినా రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది.
మునుగోడులో మరింత మందికి ప్రయోజనం..
ప్రభుత్వం గౌడ వృత్తిదారులకు పలు రకాలుగా సాయం చేస్తున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో వృత్తిదారులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. గీత వృత్తిదారులకు తాటి చెట్ల పన్ను భారం మోపొద్దని సర్కారు 2017-18లో పన్ను రద్దు చేయడంతో 5126 మంది ప్రయోజనం పొందారు. అంతే కాకుండా ఏటా వారు చెల్లించాల్సిన రూ.10.37లక్షల పన్ను సైతం రద్దు చేస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా గౌడ సామాజికవర్గానికి 9మద్యం దుకాణాలు కేటాయించిన సర్కారు ఎనిమిదేండ్లలో చెట్టుపై నుంచి పడి మరణించిన లేదా అంగవైకల్యం పొందిన 91 మంది బాధిత కుటుంబాలకు రూ.88.60లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అంతేకాకుండా నియోజకవర్గంలో 2,810 మందికి నెలనెలా రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్లను అందజేస్తున్నది.
తొలిసారిగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు..
మద్యం దుకాణాల్లో గౌడ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని గౌడన్నలు ఎన్నో ఏండ్లుగా పాలకులను వేడుకున్నా, పట్టింపు కరువైంది. కానీ, ప్రభుత్వం ఈ సారి తొలిసారిగా గౌడ సామాజిక వర్గానికి మద్యం దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలో 33మద్యం దుకాణాలుండగా, అందులో 9 దుకాణాలు గౌడ సామాజిక వర్గానికే కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ తక్కువగా ఉండటంతో తక్కువ పాటకే వాటిని దక్కించుకున్నారు. ఇక త్వరలో గౌడన్నలకు ద్విచక్ర వాహనాలు అందచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గౌడలను పట్టించుకున్నది సీఎం కేసీఆరే..
గౌడల నుదుటి రాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. గౌడ్లకు ఆర్థిక భరోసా కల్పించడానికి పింఛన్ ఇస్తున్నారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో చెరువు కట్టలపై ఈత మొక్కలను నాటించారు. ప్రమాదవశాత్తు మరణించిన గౌడన్నలకు గత ప్రభుత్వాలు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే, కేసీఆర్ సర్కారు రూ.5లక్షలు ఇస్తున్నది. గౌడలు గౌరవంగా బతికేందుకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించారు. నీరా పాలసీ తెచ్చారు. ఇక అనేక రకాలుగా ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటే మా గౌడ కులస్తులుంటారు.
– మాదగోని దేవలోకం, గీత కార్మికుడు, ఊకొండి(మునుగోడు)
వైన్స్‌లో రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కారే..
మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్ కల్పించింది టీఆర్ఎస్ సర్కారే. వృత్తులు కాలక్రమేనా అత్యాధునికంగా మారుతున్నాయి. ప్రజలు కూడా వాటినే అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించారు. దీంతో గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగడానికి ఈ పాలసీ ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్‌ను ఆలోచించే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థమవుతున్నది. అన్ని కులాలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటే.
– కొయ్యడ గాలయ్య గౌడ్, తంగడపల్లి(చౌటుప్పల్ రూరల్)
మంచి చేసిన ప్రభుత్వానికే మద్దతు
గీత కార్మికులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. గౌడ కులస్తులకు మంచి చేసిన టీఆర్ఎస్ సర్కారుకే మా మద్దతు ఉంటుంది. అర్హుడైన ప్రతి గీత కార్మికుడికి పింఛన్ అందిస్తున్నది. హరితహారంలో భాగంగా తాటి, ఈత మొక్కలు నాటించారు. ఈ ఉప ఎన్నికలోనే కాదు.. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్కే మద్దతునిచ్చి కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం.
– నకిరేకంటి యాదయ్య, గీత కార్మికుడు, లక్ష్మీదేవిగూడెం(మునుగోడు రూరల్)
వ్యాపార అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్
వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు కల్పించి తెలంగాణ సర్కారు మమ్మల్ని వ్యాపారస్తులుగా మార్చింది. వైన్స్‌లను దక్కించుకునేందుకు పెద్దపెద్ద వ్యాపారస్తులు, ఆర్థికంగా స్థిరపడ్డ వారు, రాజకీయ నేతలతో సమానంగా నిలబడేలా చేశారు. పైసలున్న వాళ్లతో పోటీపడాలంటే ఇబ్బందిగా ఉండేది. ఈ రిజర్వేషన్లతో మాకు వైన్‌షాపులు సులువుగా దక్కుతున్నాయి. రిజర్వేషన్లతో అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌కు గౌడ కులస్తులందరూ అండగా ఉంటారు.
– పోలగోని శ్రీనివాస్ గౌడ్, దామెర, నాంపల్లి
ఆర్థికంగా ఎదిగేలా చేశారు..
గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ చేశారు. మాకు తోడుగా ఉంటున్నారు. మా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. మద్యం షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. గీత కార్మికుడి కుటుంబానికి అండగా ఉండేందుకు ఎక్స్‌గ్రేషియా కూడా రూ.5లక్షలకు పెంచారు. ఇది మంచి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కల్లు గీయడంపై బీజేపీ సర్కారు నిషేధం విధించింది. అలాంటి పార్టీకి మునుగోడులో మేము గుణపాఠం చెప్తాం.. ఓడిస్తాం..
– మాదగోని బాలరాజు, గీత కార్మికుడు(సంస్థాన్ నారాయణపురం)
కులవృత్తులకు వన్నెతెచ్చిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గీత కార్మికుల బతుకులు మారినయ్. గౌడన్నలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాటిచెట్టు ఎక్కుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతుంటారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ఎక్స్‌గ్రేషియాను పెంచారు. మృతిచెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తాత్కాలిక వైకల్యం పొందిన వారికి రూ.10 వేల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నది. మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇస్తాం.
– బత్తుల సత్తయ్యగౌడ్, లక్కారం, చౌటుప్పల్